మా విజ్ఞప్తి తర్వాతే ఢిల్లీలో పీవీ స్మారక చిహ్నం: చంద్రబాబు

Published : Jun 28, 2020, 07:26 AM ISTUpdated : Jun 28, 2020, 07:27 AM IST
మా విజ్ఞప్తి తర్వాతే ఢిల్లీలో పీవీ స్మారక చిహ్నం: చంద్రబాబు

సారాంశం

మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహరావుకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. పీవీ నరసింహరావు జయంతి సందర్భంగా ఆయన ట్విట్టర్ వేదికగా నివాళులు సమర్పించారు.

అమరావతి: తన జాతి ప్రజలను సంక్షోభం నుండి గట్టెక్కించిన నాయకులను చరిత్ర మరచిపోదని, దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆర్థికరంగానికి దిశానిర్దేశం చేసి, ప్రపంచదేశాలతో పోటీపడే స్థాయికి భారతదేశాన్ని తీర్చిదిద్దిన ప్రధానిగా పీవీ నరసింహారావు చరిత్రలో నిలిచిపోయారని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పీవీ నరసింహా రావు జయంతి సందర్భంగా చంద్రబాబు ట్విట్టర్ వేదికగా ఆయనకు నివాళులు అర్పించారు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పీవీ నరసింహారావు చేపట్టిన భూసంస్కరణలు దళిత, బహుజన వర్గాల పురోగతికి ఎంతగానో దోహదం చేశాయని ఆయన అన్నారు. రాజకీయవేత్తగానే కాకుండా సాహితీవేత్తగా కూడా తెలుగుజాతికి వన్నె తెచ్చారని ఆయన అన్నారు. 

అటువంటి తెలుగు ఆణిముత్యం పీవీ నరసింహారావుకి దేశ రాజధానిలో స్మృతి చిహ్నం ఏర్పాటు చేయాలంటూ తెలుగుదేశం హయాంలో 2014లో రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామని చెప్పారు. ఫలితంగా ఆయన మరణించిన పదేళ్ళకు ఢిల్లీలోని ఏక్తాస్థల్ వద్ద పీవీ స్మారక చిహ్నం నిర్మించబడిందని చెప్పారు. 

ఆర్థిక సంస్కరణలతో  దేశ గమనాన్ని ప్రగతిపూర్వక మలుపుతిప్పిన పీవీ నరసింహారావుకి భారతరత్న ఇవ్వడం సముచితమని చంద్రబాబు అన్నారు. ఈరోజు పీవీ జయంతి సందర్భంగా దేశానికి, తెలుగువారికి,  సాహితీ లోకానికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి స్మృతికి నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ కంటే హైదరాబాద్ లోనే లోయెస్ట్ టెంపరేచర్స్ .. స్కూల్ టైమింగ్స్ చేంజ్
YS Jagan Sensational Comments: మేము అధికారంలోకి వస్తే వాళ్లందరూ జైలుకే | Asianet News Telugu