
నంద్యాల ఆగ్రో కెమికల్స్ లో భాగంగా ఏర్పాటు చేసిన ప్లాంట్ లో గ్యాస్ లీకేజి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం కాగా పట్టణ ప్రజలు భయంతో వణికిపోయారు. అదృష్టవశాత్తు ట్యాంక్ పేలుడు తీవ్రత ప్లాంట్ లోపలే పరిమితం కావడంతో పెనుప్రమాదం తప్పిపోయింది. అయినా అమ్మోనియం గ్యాస్ లీకెజి సమయంలో అక్కడే ఉన్న ప్లాంట్ జీఎం ఊపిరాఆడక సంఘటనా స్థలంలోనే మృతిచెందాడు.
అక్కడే ఉన్న మరో నలుగురు కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించిన తర్వాత వారి పరిస్థితి మెరుగుపడింది.
అలాగే దగ్గరలో ఉన్న మరికొంతమంది కార్మికులకు గ్యాస్ ప్రభావంతో కళ్ళ మంటలు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది లాంటి లక్షణాలు కనిపించాయి.
అయితే అమ్మోనియం ట్యాంక్ లీకేజీని రాత్రే గుర్తించి మరమ్మతులు చేశామని ఎస్పీవై ఆగ్రో కెమికల్స్ ఎండీ శ్రీధర్ రెడ్డి అన్నారు. మృతి చెందిన జీఎం శ్రీనివాసులు కుటుంబాన్ని ఆదుకుంటామని ఆయన వెల్లడించారు. అమ్మోనియం గ్యాస్ లీకేజి ప్రభావం ప్లాంట్ కే పరిమితం అని నంద్యాల పజలకు ఇబ్బంది లేదని అన్నారు.
read more ఎస్పీవై రెడ్డి ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్: ఒకరి మృతి, మరింత మందికి అస్వస్థత
ఎస్పీవై ఆగ్రో కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదం అనంతరం చేపట్టిన రక్షణ చర్యలను కలెక్టర్ వీరపాండియన్ స్వయంగా పరిశీలించారు. ఆగ్రోస్ ఫ్యాక్టరీ లోపల అమ్మోనియా వాయువు లీకేజిని అదుపు చేసేందుకు అన్ని శాఖల అధికారులతో కలెక్టర్ చర్చించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ... ప్రమాదం ఏమీ లేదు...ఎవరూ ఆందోళన చెందవద్దని ప్రజలకు ధైర్యం చెప్పారు. అధికారులు ప్రకటించేవరకు గృహాల నుంచి బయటకు రావద్దని ప్రజలకు ఆయన సూచించారు.కళ్ళు మంటలు వేసినట్లయితే చల్లని నీటి తడి బట్టతో కళ్ళు తుడుచుకోవాలని సూచించారు. కర్నూలు జిల్లా ఎస్పీ ఫక్కిరప్ప ఆదేశాల మేరకు నంద్యాల తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకొని జరిగిన ఘటన పై దర్యాప్తు చేస్తున్నారు.