చంద్రబాబు ససేమిరా: ప్రతిపక్ష నేతపై టీడీపి మల్లగుల్లాలు

By telugu teamFirst Published May 28, 2019, 4:13 PM IST
Highlights

తాను పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతూ ప్రతిపక్ష నేత పదవిని మరొకరికి ఇస్తే బాగుంటుందనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు చెబుతున్నారు. దానివల్ల పార్టీని తిరిగి బలోపేతం చేసుకోవడానికి తనకు సమయం చిక్కుతుందని ఆయన భావిస్తన్నట్లు చెబుతున్నారు.

అమరావతి: ప్రతిపక్ష నేత పదవిని చేపట్టేందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సిద్ధంగా లేనట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో రెండు సార్లు ఆయన ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. అయితే, అప్పటి పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు. ఆ రెండు పర్యాయాలు కూడా ముఖ్యమంత్రిగా తనకు ధీటైన నేత ఉండడం, టీడీపికి తగిన ఎమ్మెల్యేల సంఖ్య ఉండడం అందుకు కారణం.

అయితే, ఈసారి తన రాజకీయానుభవమంత వయస్సు కూడా లేని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతున్నారు. పైగా, అసెంబ్లీలో వైసిపికి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉన్నారు. వైసిపి 151 సీట్లు గెలిస్తే తెలుగుదేశం పార్టీ కేవలం 23 సీట్లకే పరిమితమైంది. ఇది చంద్రబాబుకు అశనిపాతంలాంటిదే. ఈ స్థితిలో ఆయన ప్రతిపక్ష నేతగా ఉండడానికి ఇష్టపడడం లేదని అంటున్నారు. 

తాను పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతూ ప్రతిపక్ష నేత పదవిని మరొకరికి ఇస్తే బాగుంటుందనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు చెబుతున్నారు. దానివల్ల పార్టీని తిరిగి బలోపేతం చేసుకోవడానికి తనకు సమయం చిక్కుతుందని ఆయన భావిస్తన్నట్లు చెబుతున్నారు.

తెలుగుదేశం శాసనసభా పక్షం బుధవారం, ఈ నెల 29వ తేదీన సమావేశం కాబోతోంది. ఇందులో తమ నేతను శానససభ్యులు ఎన్నుకుంటారు. నోరున్న నేతను ప్రతిపక్ష హోదాలో కూర్చోబెడితే వైసిపి ఎమ్మెల్యేల నోటికి కాస్తా తాళం వేయవచ్చుననే ఆలోచన టీడీపిలో సాగుతోంది. అయితే, మంత్రులు దేవినేని ఉమామహేశ్వర రావు, కళా వెంకట్రావు వంటి ఉద్దండులంతా ఓటమి పాలయ్యారు. 

మిగిలింది ప్రధానంగా గంటా శ్రీనివాస రావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అచ్చెన్నాయుడు. వీరిలో గంటా శ్రీనివాస రావును పక్కన పెడితే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అచ్చెన్నాయుడుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వాదనా పటిమ విషయంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి బాగానే పనికి వస్తారు. కానీ, వయస్సు, సామాజిక వర్గం ఆయనకు అడ్డు తగులుతున్నాయి. అచ్చెన్నాయుడు రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోవడంలో ధీటుగా వ్యవహరిస్తారు. పైగా బీసీ సామాజికవర్గానికి చెందినవారు. దీంతో ఆయన పేరు కూడా ప్రముఖంగానే వినిపిస్తోంది.

అదే సమయంలో చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ ఎమ్మెల్సీగా కొనసాగాలనే అనుకుంటున్నారు. ఆ విషయాన్ని ఆయన బహిరంగంగానే చెప్పారు. దీంతో శాసన మండలిలో టీడీపీకి ఆయన నాయకత్వం వహించే అవకాశాలున్నాయి. ఏమైనా, తెలుగుదేశం పార్టీయే కాకుండా ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా తీవ్రమైన సమస్యనే ఎదుర్కుంటున్నట్లు కనిపిస్తోంది. 

click me!