నా వల్ల కాదు, మీరే తేల్చుకోండి : జమ్మలమడుగు పంచాయతీపై చేతులెత్తేసిన చంద్రబాబు

By Nagaraju TFirst Published Jan 24, 2019, 6:32 AM IST
Highlights


కడప  జిల్లా రాజకీయాలు ముఖ్యంగా జమ్మలమడుగు నియోజకవర్గం రాజకీయాలు సీఎం చంద్రబాబు నాయుడి కంటిమీద కునుకు వెయ్యనివ్వకుండా చేస్తున్నాయి. ఒకవైపు వరదరాజులరెడ్డి, సీఎం రమేష్ ల మధ్య వర్గపోరు, మరోవైపు మేడా మల్లికార్జునరెడ్డి తిరుగుబాటు, తాజాగా జమ్మలమడుగు పంచాయితీ ఇలా వరుస పంచాయితీలతో చంద్రబాబు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. 

అమరావతి: కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం పంచాయితీ మళ్లీ మెుదటికి వచ్చింది. జమ్మలమడుగు పీటముడిని విప్పుదామని ప్రయత్నించి చివరికి సీఎం చంద్రబాబు చేతులెత్తేశారు. చేసేది లేక తేల్చుకుని రండంటూ పంపించేశారు. 

మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి ఇద్దరూ జమ్మలమడుగు అసెంబ్లీ టిక్కెట్ పై తగ్గకపోవడంతో చంద్రబాబు చేసేది లేక నా వల్ల కాదనేశారు. నియోజకవర్గంలో కార్యకర్తల సమక్షంలో తేల్చుకుని రావాలంటూ ఆదేశించారు. 

కడప  జిల్లా రాజకీయాలు ముఖ్యంగా జమ్మలమడుగు నియోజకవర్గం రాజకీయాలు సీఎం చంద్రబాబు నాయుడి కంటిమీద కునుకు వెయ్యనివ్వకుండా చేస్తున్నాయి. ఒకవైపు వరదరాజులరెడ్డి, సీఎం రమేష్ ల మధ్య వర్గపోరు, మరోవైపు మేడా మల్లికార్జునరెడ్డి తిరుగుబాటు, తాజాగా జమ్మలమడుగు పంచాయితీ ఇలా వరుస పంచాయితీలతో చంద్రబాబు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. 

బుధవారం జమ్మలమడుగు నియోజకవర్గంలో నెలకొన్న సమస్యకు ఫుల్ స్టాప్ పెడదామని సీఎం చంద్రబాబు నాయుడు భావించారు. అందులో భాగంగా జమ్మలమడుగు అసెంబ్లీ అభ్యర్థి ఎంపికపై జిల్లా నేతలతో అమరావతిలో సమావేశమయ్యారు. 

కడప తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డితోపాటు పలువురు కీలక నేతలు సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జమ్మలమడుగు పంచాయతీకి ఫుల్ స్టాప్ పెట్టాలని ఒకరు అసెంబ్లీకి, మరోకరు కడప పార్లమెంట్ స్థానానికి పోటీ చెయ్యాలంటూ ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డిలకు సూచించారు. 

ఎవరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు, ఎవరు ఎంపీగా పోటీ చేస్తారు అని ప్రశ్నించారు. అయితే ఇద్దరు నేతలు అసెంబ్లీ టిక్కెట్ కావాలనే పట్టుబడుతున్నారే తప్ప కడప పార్లమెంట్ స్థానం జోలికి మాత్రం పోవడం లేదు.  ఎంపీ స్థానానికి పోటీ చేసేందుకు ఇద్దరు విముఖత చూపుతున్నారు. 

మళ్లీ చంద్రబాబు నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని చెబుతూనే ఎమ్మెల్యే టికెట్‌ కోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఏం చెయ్యాలో అంతుపట్టలేక చంద్రబాబు సాయంత్రం మళ్లీ భేటీ అయ్యారు. సాయంత్రం జరిగిన భేటీలోనూ పంచాయితీ తేలలేదు. 

సాయంత్రం అయినా ఏదో ఒక నిర్ణయం వస్తుందని చంద్రబాబు ఆశించారు కానీ ఆ ఆశ నెరవేరలేదు. ఒకరు ఎమ్మెల్యేగా, మరొకరు కడప ఎంపీగా పోటీచేసేలా నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తే అది కాస్త రివర్స్ అయ్యింది. ఇద్దరూ జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసేందుకు ఆసక్తి చూపారు. 

దీంతో సమస్య కాస్త మళ్లీ మెుదటికి వచ్చింది. జమ్మలమడుగు, కడప ఎంపీ సీట్లు తేలితే జిల్లాలో టీడీపీ టిక్కెట్ల కేటాయింపు ఓ కొలిక్కివస్తుందని పార్టీ నేతలు భావించారు. కానీ అది అసాధ్యంగా నిలిచిపోయింది. ఇక చేసేది లేక చంద్రబాబు నాయుడు చేతులెత్తేశారు. 

ఈ నెలాఖరు లోగా కార్యకర్తలతో సమావేశమై ఎవరు అసెంబ్లీకి పోటీ చేస్తారు..ఎవరు కడప పార్లమెంట్ కు పోటీ చేస్తారో తేల్చుకోవాలంటూ ఆదేశించారు. ఇకపోతే జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి 2004,2009, 2014 ఎన్నికల్లో అంటే వరుసగా మూడు పర్యాయాలు గెలుపొందారు. 

రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందగా 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి హ్యాట్రిక్ సాధించారు. మూడు పర్యాయాలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రామసుబ్బారెడ్డిపైనే గెలుపొందారు. 

అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఆదినారాయణ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరిపోయారు. అంతేకాదు ఏకంగా చంద్రబాబు కేబినేట్ లో బెర్త్ కూడా దక్కించుకున్నారు. ఆదినారాయణ రెడ్డి టీడీపీలో చేరడాన్ని రామసుబ్బారెడ్డి వర్గీయులు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. 

దీంతో రామసుబ్బారెడ్డిని శాంతపరిచేందుకు చంద్రబాబు రంగంలోకి దిగారు. ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టి మండలి విప్‌గా నియమించారు. అయినా ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు ఏమాత్రం తగ్గలేదు. ఇరువురు నేతలు జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గంపైనే దృష్టిసారించారు. 

దీంతో జమ్మలమడుగు పంచాయితీ చంద్రబాబు దృష్టికి వెళ్లింది. దీంతో కొంతకాలం క్రితం చంద్రబాబు ఇద్దరితో చర్చించారు. ఇరువురు కలిసి పనిచేస్తే కడప పార్లమెంట్ స్థానం కూడా కైవసం చేసుకోవచ్చని కాబట్టి ఒకరు అసెంబ్లీకి ఒకరు పార్లమెంట్ స్థానానికి పోటీ చెయ్యాలంటూ ఆదినారాయణరెడ్డికి, రామసుబ్బారెడ్డికి సూచించారు. 

ఆనాటి నుంచి నేటి వరకు ఎవరు ఎంపీకి పోటీ చేస్తారు...ఎవరు ఎమ్మెల్యేగా బరిలోకి నిలుస్తారు అన్నది తేల్చడం ఎవరి వల్ల కావడం లేదు. చివరికి అధినేత వల్ల కూడా కాకపోవడంతో కార్యకర్తలపై భారం వేశారు. కార్యకర్తల సమావేశంలో తేల్చుకుని రావాలంటూ చంద్రబాబు పంపించేశారు. దీంతో జమ్మలమడుగు పంచాయితీ కాస్త మెుదటికొచ్చినట్లైంది.  

 

 

click me!