
ఒంగోలు: రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఒంగోలులో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా నిర్వహించిన ప్రతిభా అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చి దిద్దాలన్నదే తన లక్ష్యమన్నారు.
హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసింది ప్రపంచ పటంలో హైదరాబాద్ ను నిలబెట్టిన ఘనత తనదేనని చంద్రబాబు అన్నారు. అయితే విభజన వల్ల హైదరాబాద్ ను కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
విభజన వల్ల కట్టుబట్టలతో నెత్తిన అప్పుపెట్టుకుని వచ్చామని తెలిపారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ లో రాజధాని లేదు...కళాశాలలు లేవు..పరిశ్రమలు లేవన్నారు. ఆఖరుకు ఆదాయం వచ్చే వనరులు కూడా లేవని అయినా అధైర్య పడలేదన్నారు.
ఆంధ్రప్రదేశ్ ను ఒక నాలెడ్ట్ స్టేట్ గా తీర్చిదిద్దాలన్నదే తన లక్ష్యమని చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిపై ఒక విజన్ తయారు చేసినట్లు తెలిపారు. 2022నాటికి మూడు అత్యున్నత రాష్ట్రాల్లో ఏపీ ఒక రాష్ట్రంగా ఉంటుందని...2029నాటికి దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుంది....2050 నాటికి ప్రపంచంలోనే అత్యున్నత రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటిగా ఉంటుందని చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో 81 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని వారంతా శ్రమిస్తే ఆంధ్రప్రదేశ్ ను నాలెడ్ట్ హబ్ గా తీర్చిదిద్దడం పెద్ద సమస్యే కాదన్నారు. విద్యార్థులు చదువులో రాణిస్తే ప్రపంచానికే సేవలందించొచ్చని తెలిపారు. ఈ సందర్భంగా తిత్లీ తుఫాన్ బాధితులకు ఏపీ ప్రభుత్వ కాలేజీల అధ్యాపకుల అసోషియేషన్ ఒక్కరోజు విరాళం చెక్ ను సీఎం చంద్రబాబుకు అందజేసింది.