ఎమ్మెల్యే కారుడ్రైవర్ నిర్వాకం... ఏంటంటే

By Nagaraju TFirst Published Oct 15, 2018, 4:09 PM IST
Highlights

పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత డ్రైవర్ పోలీసులకు అడ్డంగా బుక్కయ్యాడు. ఏకంగా మంత్రులనే మోసం చేద్దామని ప్రయత్నించి ఇరుక్కుపోయాడు. ఓ ఉద్యోగం నిమిత్తం ఒక మంత్రి పేరుతో నకిలీ సిఫారసు లేఖ సృష్టించి మరో మంత్రిని మోసం చేద్దామని ప్రయత్నించాడు. 

విశాఖపట్నం: పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత డ్రైవర్ పోలీసులకు అడ్డంగా బుక్కయ్యాడు. ఏకంగా మంత్రులనే మోసం చేద్దామని ప్రయత్నించి ఇరుక్కుపోయాడు. ఓ ఉద్యోగం నిమిత్తం ఒక మంత్రి పేరుతో నకిలీ సిఫారసు లేఖ సృష్టించి మరో మంత్రిని మోసం చేద్దామని ప్రయత్నించాడు. అయితే ఆ లేఖపై అనుమానం వచ్చిన సీనియర్ మంత్రి లేఖ పంపిన మంత్రిని అడగగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 

వివరాల్లోకి వెళ్తే అఖిల్ అనే వ్యక్తి ఎమ్మెల్యే అనిత దగ్గర కారుడ్రైవర్ గా పనిచేస్తున్నాడు. తన బంధువులకు షిఫ్ట్ ఆపరేటర్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. మంత్రి రికమండేషన్ తో అయితే కానీ పని జరిగేలా లేదని భావించిన అఖిల్ అందుకు ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడును ఎంచుకున్నాడు. యనమల సీనియర్ మంత్రి కావడంతో ఆయన సిఫారసు లేఖకు విలువ ఉంటుందని గ్రహించి ఆయన పేరుతో నకిలీ సిఫారసు లేఖ సృష్టించాడు. ఆ లేఖను విద్యుత్ శాఖ మంత్రి కళా వెంకట్రావుకు అందజేశాడు.  

అయితే సిఫారసు లెటర్ పై అనుమానం వచ్చిన కళా వెంకట్రావు ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు దృష్టికి తీసుకువెళ్లారు. అయితే ఆ లేఖ తాను ఇవ్వలేదని స్పష్టం చెయ్యడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అఖిల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

అనిత డ్రైవర్ వ్యవహారం బయటకు రావడంతో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో అనిత మరోమారు వివాదంలో ఇరుక్కున్నట్లైంది. పోలీసుల అదుపులో ఉన్న డ్రైవర్ అఖిల్ ను కాపాడేందుకు అనిత ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జరుగుతుంది. అఖిల్ పై కేసు నమోదు చేయోద్దని ఎమ్మెల్యే అనిత ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. 

click me!