ఎన్నికల వరకూ సర్వేలు .. తేడా వస్తే అభ్యర్ధుల్ని మార్చేస్తా : చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

By Siva Kodati  |  First Published Feb 25, 2024, 4:54 PM IST

అభ్యర్ధుల పనితీరుపై ప్రతివారం సర్వే చేపడతామని, సర్వేల్లో తేడా వస్తే అభ్యర్ధులను మార్చేందుకు సైతం వెనుకాడబోమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. రాబోయే 40 రోజులు అత్యంత కీలకమని, నిత్యం ప్రజల్లో వుండాలని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు


టీడీపీ జనసేన తొలి జాబితా ప్రకటించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. టికెట్లు దొరకని నేతలు అసమ్మతి స్వరం వినిపిస్తూ వుండగా.. వారిని బుజ్జగించే పనిని ఆయా పార్టీల నేతలు డీల్ చేస్తున్నారు. ఈ క్రమంలో టికెట్లు పొందినవారితో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదివారం వర్చువల్‌గా సమావేశమయ్యారు. ఎన్నికల సమయం వరకు ప్రతిరోజూ చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఆయన నేతలకు దిశానిర్దేశం చేశారు.

రాబోయే 40 రోజులు అత్యంత కీలకమని, నిత్యం ప్రజల్లో వుండాలని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అభ్యర్ధుల పనితీరుపై ప్రతివారం సర్వే చేపడతామని, సర్వేల్లో తేడా వస్తే అభ్యర్ధులను మార్చేందుకు సైతం వెనుకాడబోమని ఆయన తేల్చిచెప్పారు. ప్రభుత్వ విధానాలు, ఎమ్మెల్యేల పనితీరును ఎండగట్టాలని .. ప్రజలకు నమ్మకం, ధైర్యం కలిగించాలని చంద్రబాబు సూచించారు. 

Latest Videos

జనసేన నేతలు, క్యాడర్‌ను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని.. అప్పుడే 100 శాతం ఓట్ల బదిలీ జరుగుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. ఎవరైనా అసంతృప్త నేతలు, కార్యకర్తలు వుంటే వారికి నచ్చజెప్పాలని వివరించారు. క్షేత్ర స్థాయిలో ఫీడ్ బ్యాక్.. సర్వేలు పరిశీలించాకే అభ్యర్ధులను ఎంపిక చేస్తున్నామని ఆయన వెల్లడించారు. జగన్‌పై అసంతృప్తిగా వున్న వైసీపీ నేతలు పార్టీలోకి వచ్చేలా వుంటే వారిని ఆహ్వానించాలని చంద్రబాబు సూచించారు. దొంగ ఓట్లను, డబ్బును, దౌర్జన్యాలను సీఎం జగన్ నమ్ముకున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలో కుట్రలు, కుతంత్రాలకు పాల్పడతారని .. వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా వుండాలని అభ్యర్ధులకు చంద్రబాబు హెచ్చరించారు. 

click me!