జనసేన అంత బలహీనంగా ఉందా .. దేహీ అనటం పొత్తు ధర్మమా : పవన్‌కు హరిరామ జోగయ్య ఘాటు లేఖ

By Siva Kodati  |  First Published Feb 25, 2024, 3:23 PM IST

టీడీపీ జనసేన తొలి జాబితాపై కాపు నేత, మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఒకరు ఇవ్వడం, మరొకరు దేహీ అని పుచ్చుకోవడం పొత్తు ధర్మం కాదని ఆయన తేల్చిచెప్పారు.


టీడీపీ జనసేన తొలి జాబితాపై కాపు నేత, మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. టీడీపీ జనసేన సీట్ల పంపకంపై ఆదివారం ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు బహిరంగ లేఖ రాశారు. జనసేనకు కేవలం 24 సీట్లు ఇవ్వడం ఏంటీ.. ఆ పార్టీ పరిస్ధితి అంత దయనీయంగా వుందా అని ప్రశ్నించారు. జనసేన శక్తిని పవన్ తక్కువగా అంచనా వేసుకుంటున్నారు.. 24 సీట్ల కేటాయింపు జనసైనికులను సంతృప్తి పరచలేదని.. రాజ్యాధికారంలో వాళ్లు వాటా కోరుకుంటున్నారని హరిరామజోగయ్య వ్యాఖ్యానించారు. 

పవన్‌ను సీఎంగా చూడాలనేది వారి కోరిక అని.. పార్టీ శ్రేణులను సంతృప్తిపరచకుండా వైసీపీని ఎలా ఓడించగలరు అంటూ ఆయన ప్రశ్నించారు. పొత్తు ధర్మం ప్రకారం సీట్ల కేటాయింపు జరగలేదని హరిరామజోగయ్య విమర్శించారు. ఒకరు ఇవ్వడం, మరొకరు దేహీ అని పుచ్చుకోవడం పొత్తు ధర్మం కాదని ఆయన తేల్చిచెప్పారు. చెరిసగం మంత్రి పదవులు దక్కాలి.. ఇవ్వన్నీ చంద్రబాబు నాయుడే ప్రకటించాలని హరిరామజోగయ్య డిమాండ్ చేశారు. సీట్లు ఎన్ని కేటాయించారనే ప్రసక్తి లేకుండా ఈ రకమైన ప్రకటన విడుదలైతే జనసైనికులందరూ సంతృప్తి పడే అవకాశం వుందని.. ఈ సంక్షోభానికి ఇదే మాత్ర అని ఆయన తెలిపారు. 

Latest Videos

అయితే జనసేన పార్టీ పొత్తులో భాగంగా 24 అసెంబ్లీ, 3 లోక్‌సభ స్థానాలకు పరిమితం కావడం పట్ల అధికార వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. చంద్రబాబు తన సామాజిక వర్గానికి 21 సీట్లు ప్రకటించుకున్నారని, కాపులకు మరీ హీనంగా 7 సీట్లు ప్రకటించారని మండిపడ్డారు.

చంద్రబాబు శ్రేయస్సు కోసమే రాజకీయాలు చేసే పవన్ .. 24 సీట్లతో కాపులకు రాజ్యాధికారం అందిస్తాడా అని నాని ప్రశ్నించారు. పవన్ ఎలాంటివాడో కాపులకు ఇవాళ అర్ధమైందని.. ఇన్నాళ్లు తమను విమర్శించినవాళ్లు ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటారని ఆయన ఘాటు విమర్శలు చేశారు. పవన్ ఎక్కడ పోటీ చేయాలో చంద్రబాబే నిర్ణయిస్తారని పేర్ని నాని ఎద్దేవా చేశారు. 

జనసేన, టీడీపీ కార్యకర్తలు త్యాగం చేయాలి కానీ.. చంద్రబాబు , పవన్ కుటుంబాలు మాత్రం సీట్లు పంచేసుకున్నారని చురకలంటించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, కాపులకు ప్రాధాన్యం ఇచ్చేది జగనే అని.. భువనేశ్వరి భయంతో చంద్రబాబు తన సీటును కూడా ప్రకటించుకున్నాడని దుయ్యబట్టారు. కుప్పం సీటు భువనేశ్వరి లాక్కుంటారేమోనని భయపడ్డారని పేర్ని నాని సెటైర్లు వేశారు. 

click me!