
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయులు లేఖ రాశారు. సీఎం వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన, వ్యవస్థల విధ్వంసం జరుగుతుందని అన్నారు. న్యాయ వ్యవస్థ, కేంద్ర సంస్థలపై దాడులు జరుగుతున్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రతిపక్షాలపై అక్రమ కేసులు, అధికార దుర్వినియోగం, ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ నిర్ణయాలు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాయని ఆరోపించారు.
తనపై దాడుల విషయమై సీబీఐ విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రణాళిక ప్రకారం ప్రభుత్వ ప్రోత్సాహంతోనే తనపై దాడులు జరగుతున్నాయని ఆరోపించారు. చిత్తూరు జిల్లాలో తనపై హత్యాయత్నం చేశారని.. అయితే తిరిగి తనపైనే హత్యాయత్నం కేసు పెట్టారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తీవ్రమైన, అసాధారణ పరిస్థితులు ఉన్నాయని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. వారికున్న విశేషాధికారాలతో రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని కోరారు. మొత్తంగా చంద్రబాబు..9 పేజీల లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. లేఖలో పేర్కొన్న ఘటనలపై 75 పేజీల అనుబంధ పత్రం లేఖకు జత చేశారు.
ఇక, 5 కోట్ల మంది తెలుగు ప్రజలు 2019 నుంచి వైఎస్ జగన్ అప్రజాస్వామిక, రాజ్యంగ వ్యతిరేక పాలనలో ఎదుర్కొంటున్న సమస్యలను వివరించేందుకు ప్రతిపక్ష నేతగా తాను ఈ లేఖ రాస్తున్నానని పేర్కొన్నారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే విధ్వంసక పాలనను ఆవిష్కరించారని.. ప్రజా ఆస్తి అయిన ‘ప్రజా వేదిక’ని కూల్చివేసి తన అసంబద్ధమైన మనస్తత్వాన్ని తెలియజేశాడని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన రాజధాని అమరావతిని వినాశకర నిర్ణయాలతో నాశనం చేశాడని ఆరోపించారు. దేవాలయాలపై దాడులు, గంజాయి అమ్మకాలు, దొంగ ఓట్ల రాజకీయం, మీడియాపై దాడులు పెరిగిపోయాయని చంద్రబాబు ఆరోపణలు చేశారు.