
రాష్ట్రంలోని వరద బాధితులను ఆదుకోవాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు (Sameer Sharma ) తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) లేఖ రాశారు. వరదల్లో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంపై న్యాయ విచారణకు చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అంచనాల ప్రకారం రూ. 6, 054 కోట్ల నష్టం వాటిల్లితే.. కేవలం రూ. 35 కోట్ల నిధులను మాత్రమే విడుదల చేయడం సరైన పద్దతి కాదన్నారు. ప్రకృతి వైపరీత్యాల కోసం ఖర్చు పెట్టాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లించినట్టు కాగ్ తప్పు పట్టిందన్నారు. జాతీయ ప్రకృతి విపత్తుల నిర్వహాణ నిబంధనలకు విరుద్దంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు.
ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే అన్నమయ్య ప్రాజెక్టు (annamaiah project) కొట్టుకుపోయిందని ఆరోపించారు. తుమ్మలగుంట చెరువును ఆట స్థలంగా మార్చడం వల్లే... తిరుపతి నగరాన్ని వరదలు ముంచెత్తాయని మండిపడ్డారు. కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో వరదలతో భారీ ప్రాణ నష్టంతోపాటు... ఆస్తి, పంట నష్టం సంభవించాయని ఆవేదన చెందారు. రోడ్లు, వంతెనలతోపాటు విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలు దారుణంగా దెబ్బతిన్నాయని అన్నారు.
వరద తగ్గి చాలా రోజులైనా ఇప్పటికీ బాధితులు రోడ్ల మీదే ఉన్నారని.. తిండి, నీళ్లు లేక అల్లాడుతున్నారని అన్నారు. వరదల కారణంగా మృతిచెందిన వారి కుటుంబాలకు 25 లక్షలు, మిగిలిన బాధిత కుటుంబాలకు 2 లక్షల పరిహారం ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఇళ్లు కోల్పోయిన వారికి ఇళ్లు కట్టివ్వాలని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.
ఇక, ఏపీలోని నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలో భారీ వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చంద్రబాబు.. కడప, తిరుపతి, నెల్లూరులోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన.. ప్రభుత్వం సరిగా స్పందించలేదని చంద్రబాబు విమర్శించారు.