
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ మినీ మేనిఫెస్టోలో పెట్టిన పూర్ టు రిచ్ విధానం వినూత్నమైందని అన్నారు. పూర్ టు రిచ్ విధానం అర్థం చేసుకోవడం కష్టమైనా.. ఆచరణలో ఇది అద్భుత ఫలితాన్ని ఇస్తుందని అన్నారు. బుధవారం రోజున మీడియాతో చిట్‌చాట్‌లో భాగంగా చంద్రబాబు ఈ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో పేదరికం ఉందన్నది ఎంత వాస్తవమో సంపద సృష్టి కూడా అంతే అవసరమన్నారు. పేదలకు ఇప్పుడు రోజుకు రూ. 150 మాత్రమే వస్తుందని చెప్పారు. సంపద సృష్టి ద్వారా పేదరికం పోగొట్టాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు.
ప్రజలు, ప్రైవేట్ భాగస్వామ్యమే పీ4 విధానం అని చంద్రబాబు అన్నారు. మహిళలకు ఇప్పటి వరకు ప్రకటించిన నాలుగు పథకాలే ప్రకటించామని.. వారికి వీలైనన్నీ ఎక్కువ పథకాల కోసం ఆలోచిస్తున్నామని చెప్పారు. మహిళల భాగస్వామ్యంతో కుటుంబం- సమాజం బాగుపడేలా చేస్తామని అన్నారు. ‘‘కట్టెల పొయ్యిపై మా అమ్మ పడిన కష్టాలు ఎన్నో నేను దగ్గర ఉండి చూశాను. మా అమ్మ కష్టాలు చూసే ఆనాడు గ్యాస్ సిలిండర్లు తీసుకొచ్చాం. పెరిగిన ధరలతో మళ్లీ కట్టెల పోయ్యికి పరిమితమయ్యేలా ఉన్నారు. అందుకే మూడు సిలిండర్లు ప్రకటించాం’’ అని చంద్రబాబు అన్నారు.
మహిళా శక్తి అనేది ఎప్పుడూ నిర్లక్ష్యానికి గురవుతూ వస్తోందని చంద్రబాబు అన్నారు. అందుకే అమెరికాకు ఇప్పటి వరకూ మహిళ అధ్యక్షురాలిగా కాలేదని తెలిపారు. టీడీపీ మినీ మేనిఫెస్టోలో మహా శక్తి పేరిట మహిళలకు ప్రాధాన్యం కల్పించామని చెప్పారు. సంపద సృష్టించే అమరావతిని వైఎస్ జగన్ చంపేశారని విమర్శించారు. ఒకరి ముర్ఖత్వానికి రాష్ట్రం బలికావాలా? అని ప్రశ్నించారు. అమరావతిని రాజధానిగా ప్రకటించే ముందు అక్కడ భూమి ధర ఎంత అని ప్రశ్నించారు. అమరావతి రాజధానిగా అభివృద్ది కొనసాగి ఉంటే.. ఎక్కడ భూమి ధర ఎంత ఉండేదో ఎవరైనా బేరీజు వేశారా? అని ప్రశ్నించారు. కృష్ణా-గోదావరితో రెండు రాష్ట్రాల్లోని ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వొచ్చని అన్నారు.
తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు తగ్గితే.. ఏపీలో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని అన్నారు. కౌలు రైతుల పరిస్థితి దారుణంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు.