
అన్నమయ్య జిల్లా : ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లిలో టమాటా రైతు దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు బోడి మల్లెదిన్నెకు చెందిన నారెం రాజశేఖర్ రెడ్డి. ఆయన నిన్న మార్కెట్కు 71 క్రేట్ల టమాటాను తీసుకువచ్చాడు. రైతు టమాటాలు అమ్మి వచ్చిన డబ్బులు దోచుకోవడానికి వచ్చిన దుండగులు అతడిని హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఊరికి దూరంగా అతని ఇల్లు ఉండడం కూడా ఈ దారుణం చేయడానికి సహాయం చేసిందని అంటున్నారు. మొదట ఒకసారి వచ్చి రాజశేఖర్ రెడ్డి ఇంట్లో ఉన్నాడా? అని ఆరా తీశారు దుండగులు. ఆ తరువాత కాసేపటికే అతను మృతి చెందాడు. నిన్న రాజశేఖర్ రెడ్డి మార్కెట్ కు టమాటాను వేయడంతో అతని దగ్గర దాని తాలూకు డబ్బులు భారీగా ఉండొచ్చని హత్య చేశారని అనుమానిస్తున్నారు.
రాజశేఖర్ రెడ్డి మెడకు టవల్ తో ఉరి బిగించి హత్య చేశారు దుండగులు. టమాటాల కోసం వచ్చిన వారే హత్య చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులకోసం గాలిస్తున్నారు. దీని గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.