చంద్రబాబును వదలనంటున్న 23: మరోసారి రిపీటైన సెంటిమెంట్

By Siva KodatiFirst Published Jan 27, 2020, 5:57 PM IST
Highlights

ఒకప్పుడు ఎన్డీఏ కన్వీనర్‌గా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుకు ప్రస్తుతం టైం అస్సలు బాలేదు. మరి ముఖ్యంగా 23 అనే నెంబర్ ఆయనను వెంటాడుతోంది

ఒకప్పుడు ఎన్డీఏ కన్వీనర్‌గా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుకు ప్రస్తుతం టైం అస్సలు బాలేదు. మరి ముఖ్యంగా 23 అనే నెంబర్ ఆయనను వెంటాడుతోంది.

వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను ఫిరాయింపులకు ప్రోత్సహించిన ఆయనకు ఎన్నికల్లో 23 మంది ఎమ్మెల్యేలే మిగలడం యాధృచ్చికం. అదే సమయంలో ఎన్నికల ఫలితాలను కూడా మే 23నే ప్రకటించగా, తాజాగా ఏపీ శాసనమండలి రద్దు నిర్ణయాన్ని సైతం జగన్ జనవరి 23నే ప్రకటించడం విశేషం.

Also Read:శాసనమండలి రద్దు: ఏపీ అసెంబ్లీ ఆమోదం, టీడీపీ గైర్హాజర్

ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ రెడ్డి.. చంద్రబాబుపై సెటైర్లు వేశారు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి ఆగస్టు సంక్షోభం ఉండేదని, ఆ నెల వస్తుందంటే చాలు టీడీపీ శ్రేణులు వణికిపోయేవని ఆయన తెలిపారు.

శాసనమండలి రద్దుపై సోమవారం ప్రసంగించిన అమర్‌నాథ్ రెడ్డి.. తెలుగుదేశం పార్టీకి ఆగస్టు సంక్షోభం పోయి 2019 ఎన్నికల నుంచి 23 సంక్షోభం దాపురించిందన్నారు. ఎన్నికల్లో 23 మంది ఎమ్మెల్యే గెలిచిన సంగతిని గుర్తుచేసిన ఆయన.. మండలి రద్దు గురించి కూడా జనవరి 23నే చెప్పడం యాధృచ్చికమన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు సీఎం జగన్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని అమర్‌నాథ్ రెడ్డి తెలిపారు.

ఇక తెలుగుదేశం పార్టీకి సెంటిమెంట్‌‌గా మారిన ఆగష్టు సంక్షోభం విషయానికి వస్తే.. ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ను 1983 ఆగష్టులోనే నాదెండ్ల భాస్కరరావు గద్దె దించారు.

Also Read:రాజకీయ కోణంలో పనిచేసే శాసనమండలి అవసరమా: జగన్

అలాగే 1995 ఆగష్టులో టీడీపీ ఎన్టీఆర్, చంద్రబాబు వర్గాలుగా విడిపోయింది. ఈ క్రమంలో మెజారిటీ ఎమ్మెల్యేలు బాబు పక్షాన ఉండటంతో ఎన్టీ రామారావును గద్దె దింపి ఆయన 1995 సెప్టెంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 
 

click me!