వైసీపీ నేతల కుంభకోణాలను ఆధారాలతో బయటపెట్టాలి: బాబు

By narsimha lodeFirst Published Oct 6, 2020, 5:42 PM IST
Highlights

ప్రతి నియోజకవర్గంలో వైసిపి స్కామ్ లను బట్టబయలు చేయాలని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు పార్టీ నేతలను కోరారు. మంత్రి జయరామ్ భూముల కబ్జాపై సాక్ష్యాధారాలతో అయ్యన్నపాత్రుడు రుజువు చేశారన్నారు. 

అమరావతి: ప్రతి నియోజకవర్గంలో వైసిపి స్కామ్ లను బట్టబయలు చేయాలని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు పార్టీ నేతలను కోరారు. మంత్రి జయరామ్ భూముల కబ్జాపై సాక్ష్యాధారాలతో అయ్యన్నపాత్రుడు రుజువు చేశారన్నారు. 

అదేవిధంగా ప్రతి మంత్రి, వైసిపి ఎమ్మెల్యేల అవినీతిని డాక్యుమెంట్ ఎవిడెన్స్ లతో సహా ప్రజల్లో ఎండగట్టాలని ఈ వీడియో కాన్ఫరెన్స్ లో టిడిపి నాయకులకు చంద్రబాబు పిలుపునిచ్చారు.

టీడీపీ సీనియర్లతో చంద్రబాబు నాయుడు వీడియో కాన్పరెన్స్ ద్వారా మంగళవారం నాడు మాట్లాడారు. కరోనాపై ప్రజలను మరింత అప్రమత్తం చేయడం, చైతన్యపర్చడం, బాధితులకు కావాల్సిన సేవలు అందించడం లక్ష్యంగా టిడిపి తరఫున ‘‘ఏపి ఫైట్స్ కరోనా’’ వెబ్ సైట్ ప్రారంభించామన్నారు.. ప్రజల సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించడమే దీని లక్ష్యమన్నారు.

దళితులపై దాడులు, దౌర్జన్యాలు ఆగడం లేదని చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో మరో శిరోముండనాన్ని ఆయన ప్రస్తావించారు.  రూ 30వేలు అప్పు చెల్లించలేదని బిసి యువకుడికి శిరోముండనం చేయడం దారుణమన్నారు.. 3నెలల్లో 3జిల్లాలలో ముగ్గురికి శిరోముండనం చేయడం  వైసిపి అరాచకాలకు పరాకాష్టగా ఆయన పేర్కొన్నారు.

వైసిపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించిన మాజీ ఎంపి సబ్బం హరి ఇంటి ప్రహరీ కూల్చేశారు, విజయవాడలో పట్టాభి కారు ధ్వంసం చేశారు. 
గురజాలలో టిడిపి నాయకుడు శ్రీనివాసరావు మూడున్నర ఎకరాల బొప్పాయి తోట ధ్వంసం చేశారన్నారు.

బనగాన పల్లె మాజీ ఎమ్మెల్యే బిసి జనార్ధన్ రెడ్డిని తీవ్రంగా వేధిస్తున్నారు..టిడిపి కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు.
18ఏళ్ల క్రితం అంశంపై కడప జిల్లా టిడిపి నాయకుడు హరిప్రసాద్ అరెస్ట్ చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.వ్యాపారుల దుకాణాలను కొట్టేస్తే వారికి పరిహారం ఇవ్వాలని, చిరువ్యాపారుల తరఫున మాట్లాడిన జ్యోతుల నవీన్ పై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం దుర్మార్గమన్నారు.

ఒకాయన బూతుల మంత్రి, మరొకాయన హవాలా మంత్రి, ఇంకొకాయన బెంజ్ మినిష్టర్, ...ఇక ముఖ్యమంత్రి కథ చెప్పక్కర్లేదు. ఇదీ ఇప్పటి పాలకుల నైజమని ఆయన చెప్పారు.మనం చేస్తోంది దుర్మార్గులతో పోరాటం.. వైసిపిపై పోరాటంలో అనుక్షణం అప్రమత్తత అవసరం, మనోధైర్యం ముఖ్యమని చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు.

రాష్ట్రంలో  దేవాలయాలపై దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలో లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం ధ్వంసం. ఈ రోజు ఆదోనిలో ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం. నరసరావుపేట శృంగేరీ శంకర మఠం వద్ద సరస్వతీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

 కేంద్రం తెచ్చిన 3 వ్యవసాయ బిల్లుల అధ్యయనం చేయాలి. రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్ పి) ఉండాలన్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డులను కొనసాగించాలి, రైతులకు మరిన్ని వసతులు కల్పించాలని ఆయన కోరారు.  ప్రస్తుతం ఉన్న ప్రయోజనాలను కొనసాగిస్తూనే మరింత లబ్ది రైతులకు చేకూర్చాలి అనేది టిడిపి వాదన..దానినే మన ఎంపిలు పార్లమెంటులో వినిపించారని ఆయన గుర్తు చేశారు.

కరోనాతో ప్రజలు సతమతం అవుతుంటే వైసిపి నాయకులు మాత్రం అవినీతి కుంభకోణాల్లో మునిగి తేలుతున్నారని చంద్రబాబు ఆరోపించారు.. ఇళ్ల స్థలాలకు భూసేకరణలో రూ 4వేల కోట్లు, లెవలింగ్ పేరుతో రూ 2వేల కోట్ల నరేగా నిధులు స్వాహా చేశారని బాబు విమర్శించారు.
 

click me!