శిష్యుడు రేవంత్ బాటలోనే గురూజీ చంద్రబాబు... టిడిపి ఆరు గ్యారంటీ హామీలు

By Arun Kumar PFirst Published Jan 1, 2024, 7:45 AM IST
Highlights

తెలంగాణలో అధికార బిఆర్ఎస్ ను గద్దె దింపేందుకు కాంగ్రెస్ ఆరు గ్యారంటీ హామీలను ఉపయోగించుకుంది. ఇదే ఫార్ములాను ఆంధ్ర ప్రదేశ్ లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కూడా వాడుతోంది. 

అమరావతి : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తన శిష్యుడు రేవంత్ రెడ్డి అనుసరించిన వ్యూహాన్నే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఫాలో అవుతున్నారు. కేసీఆర్ నేతృత్వంలోని బిఆర్ఎస్ ను ఓడించేందుకు ఆరు గ్యారంటీ హామీలు కాంగ్రెస్ కు చాలా ఉపయోగపడ్డాయి. ఇలాగే ఆంధ్ర ప్రదేశ్ లో కూడా వైసిపిని ఓడించి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపేందుకు చంద్రబాబు కూడా ఆరు గ్యారంటీలతో తొలివిడత మేనిఫేస్టో విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు ఆరు గ్యారంటీ హామీలను గుర్తుచేసారు. 

సంక్షేమం, అభివృద్ది రెండు చక్రాలపై సాగే సుపరిపాలన కోసం, పేదరికంలేని సమాజం నిర్మాణం కోసం సమగ్ర పథకాల రచిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ఇప్పటికే టిడిపి ఆరు గ్యారంటీలను ప్రకటించింది... మలివిడతగా టిడిపి, జనసేన కలిసి రాష్ట్ర దశదిశ మార్చే సమగ్ర మేనిఫేస్టోను రూపొందిస్తున్నట్లు తెలిపారు. అతి త్వరలో టిడిపి-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేస్తామని చంద్రబాబు వెల్లడించారు. 

Latest Videos

ఈ నూతన సంవత్సరంలో మరో నూరు రోజుల్లోనే ఆటవిక పాలన నుండి రాష్ట్ర ప్రజలకు విముక్తి లభిస్తుందని చంద్రబాబు అన్నారు. నాలుగున్నరేళ్ల నరకం 2023 లో  పరాకాష్టకు చేరింది... అన్నింటినీ ప్రత్యక్షంగా అనుభవించాం, భరించామని అన్నారు. కానీ ఈ కొత్త సంవత్సరంలో ఈ నరకం నుండి విముక్తి పొందే అవకాశం వస్తుంది... దీన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని సూచించారు. శతాధిక తప్పిదాల శిశుపాలుడిపై ఓటు అనే సుదర్శన చక్రం ప్రయోగించాలని... జగన్ ను సాగనంపేందుకు సిద్దంకావాలని ప్రజలకు సూచించారు చంద్రబాబు. 

Also Read  New Year Celebrations: తెలుగువారికి ప్రముఖుల శుభాకాంక్షలు

 కొత్త సంవత్సరం అందరి జీవితాల్లో కొత్త వెలుగులు, సిరిసంపదలు, శాంతి భద్రతలు, ఆయురారోగ్యాలు నింపాలని చంద్రబాబు కోరుకున్నారు. 
కోటి ఆశలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుదామని అన్నారు. గతించిన కాలం దుర్భరంగా ఉన్నప్పుడు ఆ చేదు జ్ఞాపకాలు త్వరగా మరిచిపోవాలని... అలాంటి రోజులు మళ్లీ వెంటాడకుండా జాగ్రత్త పడాలని అన్నారు. మంచి రోజుల కోసం మంచి నిర్ణయాలు తీసుకోవాలని నూతన సంవత్సర ఆరంభంలో సంకల్పిద్దామని చంద్రబాబు పేర్కొన్నారు. 

తెలుగు జాతిని, ఖ్యాతిని ఏ శక్తి అడ్డుకోకుండా చూసే పూచీ తాను తీసుకుంటానని అన్నారు. ఒక్క అవకాశం అని ప్రాధేయపడితే నమ్మి అర్హతలేని వారిని అందలమెక్కించి నష్టపోయాం... అలాంటి తప్పు తిరిగి చేయవద్దని అన్నారు. హింస, అశాంతి , అక్రమాలు, అమానుషాలు,అవినీతి లేని  ఆధునిక ఆంధ్ర ప్రదేశ్ నిర్మాణానికి పునాదులు వేద్దామని...  విశ్వ వినువీధుల్లో తెలుగు జాతి జయపతాక రెపరెపలాడిద్దామని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. 

 

click me!