Chandrababu Naidu: నేను అలా కోర‌లేదు.. HAL వివాదంపై స్పందించిన చంద్ర‌బాబు

Published : May 29, 2025, 10:50 AM IST
chandra babu naidu

సారాంశం

క‌ర్ణాట‌క నుంచి హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు త‌ర‌లించ‌మ‌ని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను చంద్రబాబు కోరిన‌ట్లు వార్తలు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. దీనిని క‌ర్ణాట‌క నాయ‌కులు ఖండించారు. దీంతో ఇది కాస్త వివాదంగా మారింది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) ను కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్‌కు మార్చాలని తాను ఎప్పుడూ కోరలేదని బుధవారం స్పష్టంగా ప్రకటించారు. కడపలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ (టిడిపి) వార్షిక మహానాడులో మాట్లాడిన ఆయన, "బెంగళూరులో HAL ఒక పెద్ద, కీలక ప్రాజెక్ట్. అలాంటి సంస్థలు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి మారాలని కోరటం నా అభిప్రాయం కాదు. నేను ఎప్పుడూ అలాంటి అభ్యర్థన చేయలేదు," అని క్లారిటీ ఇచ్చారు.

రాష్ట్రానికి కొత్తగా రక్షణ రంగ పరిశ్రమలు తీసుకురావాలని మాత్ర‌మే నేను కోరాను. ఈ దిశగా కేంద్రాన్ని అభ్యర్థించాన‌ని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా లేపాక్షి విమాన తయారీ, డిఫెన్స్ రంగానికి ఎంతో అనుకూలంగా ఉంటుంద‌ని తెలిపిన‌ట్లు చంద్ర‌బాబు వివ‌రించారు.

"లేపాక్షిని అభివృద్ధి చేయాలన్న నా ఉద్దేశాన్ని, కొంతమంది రాజకీయ నేతలు తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను ఎప్పుడూ HALను తరలించాలని చెప్పలేదు," అని చంద్ర‌బాబు నాయుడు స్పష్టం చేశారు. క‌ర్ణాట‌క‌కు చెందిన ప‌లువురు నాయ‌కుల నుంచి విమ‌ర్శ‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో చంద్ర‌బాబు స్ప‌ష్ట‌త‌నిచ్చే ప్ర‌య‌త్నం చేశారు.

ఇదిలా ఉంటే గ‌త కొన్ని రోజుల క్రితం చంద్ర‌బాబు నాయుడు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను క‌లిసిన విష‌యం తెలిసిందే. రాయలసీమ ప్రాంతంలో రక్షణ పరిశ్రమ హబ్‌ను స్థాపించాలంటూ వినతిపత్రం సమర్పించారు. ఆ సందర్భంగా రాష్ట్రానికి మౌలిక వసతులు, నైపుణ్యం ఉన్న యువత, పారదర్శక విధానాలు ఉన్నాయని వివరించి, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించగలదని పేర్కొన్నారు.

ఇండస్ట్రీ, పరిశోధన, శిక్షణ, స్వదేశీ విమాన తయారీ వంటి అన్ని అంశాల్లో రాష్ట్రం ముందడుగు వేయడానికి తాను రూపొందించిన వ్యూహాన్ని కేంద్రానికి వివరించినట్లు వెల్లడించారు. "తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి. ఇతర రాష్ట్రాల నుంచి ప్రాజెక్టులను తీసుకురావాలనే ఉద్దేశం కానీ, అభివృద్ధికి వ్యతిరేకంగా కానీ మేము ఎప్పుడూ ఉండము," అని చంద్రబాబు స్పష్టం చేశారు. మ‌రి బాబు ఇచ్చిన ఈ క్లారిటీతో ఈ వివాదానికి ఇక్క‌డితో ఫుల్ స్టాప్ ప‌డుతుందో చూడాలి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

లోకేష్ పంచ్ లకి పడి పడి నవ్విన టీచర్స్ Nara Lokesh Meets Teachers Returned from Singapore Study Tour
ఇలా చేస్తే ఒక్క క్లిక్ తో ఏ సబ్జెక్టువీక్ ఉన్నాడో ఈజీగా తెలిసిపోతుంది | Nara Lokesh Meets Teachers