మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గుంటూరులో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గుంటూరు ప్రజలపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
గుంటూరు: గుంటూరు ప్రజలపై తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. గుంటూరు ప్రజలకు సిగ్గుంటే వైసీపీకి మద్దతు ఇవ్వరని ఆయన అన్నారు. గుంటూరు ప్రజలకు రోషం, పౌరుషం లేవా అని ఆయన ప్రశ్నించారు. పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచినా మాట్లాడడం లేదని అన్నారు. ప్రజల అసమర్థత వల్లనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఓట్లు అడుగుతున్నారని ఆయన అన్నారు.
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు సోమవారం గుంటూరులో రోడ్ షో నిర్వహించారు. టీడీపీ అభ్యర్థులను గెలిపిచాలని ఆయన కోరారు. తాను వచ్చింది ఓటు కోసం కాదని, ప్రజల భవిష్యత్తు కోసమని ఆయన చెప్పారు.
మాచర్లకు రౌడీషీటర్ ను చైర్మన్ గా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. వైసీపీ ఎమ్మెల్యేలు బతికున్నా చచ్చినట్లేనని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం వైసీపీ గుణ పాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని అన్నారు. ఆ విషయం విశాఖ, విజయవాడ పర్యటనల్లో అర్థమైందని ఆయన అన్నారు.
వైసీపీ నేతల రౌడీయింజ తన వద్ద సాగదని, పేకాట మంత్రికి, అవినీతి మంత్రికి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఆయన అన్నారు. రాజధానిగా అమరావతి అమోదయోగ్యమో కాదో ఓటు ద్వారా చెప్పాలని ఆయన ప్రజలను కోరారు.