సంక్రాంతి సాక్షిగా నేను, పవన్ ఇచ్చే హామీ ఇదే..: భోగి వేడుకల్లో చంద్రబాబు కామెంట్స్ 

By Arun Kumar PFirst Published Jan 14, 2024, 11:49 AM IST
Highlights

రాజధాని అమరావతిలో టిడిపి, జనసేన ఆధ్వర్యంలో చేపట్టిన 'భోగి సంకల్పం' కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు అధికార వైసిపి పై ధ్వజమెత్తారు. 

అమరావతి : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ రాజధాని అమరావతిలో సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. భోగి సందర్భంగా ఉదయమే ఇద్దరు నాయకులు రాజధాని పరిధిలోని మదడం గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా భోగిమంటలు వేయడంతో పాటు మహిళలు వేసిన రంగురంగుల ముగ్గులను వీక్షించారు. అలాగే గంగిరెద్దులు, గోవులు, కోడిపుంజులతో పూర్తిగా సంక్రాంతి శోభను సంతరించుకున్న ఆ ప్రాంతంలో కలియతిరిగారు చంద్రబాబు, పవన్ కల్యాణ్.  

ఈ సందర్భంగా టిడిపి, జనసేన ఆధ్వర్యంలో చేపట్టిన 'భోగి సంకల్పం' కార్యక్రమంలో చంద్రబాబు, పవన్ పాల్గోన్నారు. ఈ సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ... వైసిపి సర్కార్ పై, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు.  ఈ ఐదేళ్ల పాలనలో రైతులు పడ్డ ఇబ్బందులు పగవాడికి కూడా రాకూడదని అన్నారు. ముఖ్యంగా రాజధాని ప్రాంత రైతుల బాధను చూసి అందరూ చలించిపోయారు...  కానీ వైసిపి పాలకులు మాత్రం కరగలేదని అన్నారు. దేవతల రాజధానిని రాక్షసులు పాలిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. 

Latest Videos

రైతుల బాధ చూస్తే బాధ కలుగుతోంది... ప్రభుత్వాన్ని చూస్తే కోపం వస్తోందని చంద్రబాబు అన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని అభివృద్ది చేసుకునేందుకు టిడిపి ప్రభుత్వం అన్నిఏర్పాట్లు చేసింది... ఇంతలో వైసిపి అధికారంలోకి వచ్చి అంతా నాశనం చేసిందన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరూ ఆలోచించాలని చంద్రబాబు సూచించారు. 

Also Read  టిడిపి, జనసేన సంక్రాంతి జోష్ ... భోగి మంటలు వేసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్

వైసిపి ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమయ్యిందని... మరో 85 రోజుల్లో టిడిపి-జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందని చంద్రబాబు అన్నారు. అమరావతి నుంచే ఈ కౌంట్ డౌన్ ప్రారంభిస్తున్నామని అన్నారు. భవిష్యత్యులో రాజధాని అమరావతి కేంద్రంగానే అభివృద్ధి జరుగుతుందన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతే వుంటుందని తనతో పాటు పవన్ కూడా హామీ ఇస్తున్నారని అన్నారు. విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ది చేస్తామని... కర్నూల్ లో హైకోర్ట్ బెంచ్ ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. వచ్చే ఏడాది ఇదే ప్రాంతంలో సంక్రాంతి వైభవంగా జరుపుకునే రోజు వస్తుందని చంద్రబాబు అన్నారు. 

ఇక అమరావతి నుంచి పేదల పాలన ప్రారంభం అవుతుందని చంద్రబాబు అన్నారు. భవిష్యత్ లో యువతకు ఉపాధి కల్పించే బాధ్యత టీడీపీ-జనసేన తీసుకుంటుందన్నారు. పేదవాడికి సంపద సృష్టించడమే ఏకైక ద్యేయంగా ముందుకెళ్తామన్నారు. వైసీపీ విముక్త రాష్ట్రం కోసం అందరూ కలిసిరావాలని చంద్రబాబు కోరారు. 

వైసిపి ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరిట రూ.10 ఇస్తోంది... కానీ ప్రజల నుండి రూ.100 దోచుకుంటోందని చంద్రబాబు అన్నారు. ఈ ఐదేళ్లలో రాష్ట్రంలో కూల్చడం తప్ప నిర్మించింది ఏమీ లేవన్నారు. ఈ రాక్షన పాలన  త్వరలోనే ముగిసి ప్రజా పాలన మొదలవుతుందని టిడిపి చీఫ్ చంద్రబాబు అన్నారు. 
 

click me!