విజయవాడలో చీరల దొంగల ముఠా ... ఆటకట్టించిన డిప్యూటీ సీఎం కూతురు  

By Arun Kumar PFirst Published Jan 14, 2024, 7:28 AM IST
Highlights

తన కళ్లముందే దొంగతనం జరుగుతుంటే చూస్తూ వుండలేకపోయారు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కూతురు. ఎంతో తెగువ ప్రదర్శించి స్వయంగా ఓ మహిళా దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. 

విజయవాడ : ఖరీదైన చీరలను దొంగిలించి పారిపోతున్న ఓ మహిళా దొంగల ముఠా ఆటకట్టించారు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణస్వామి కూతురు కృపాలక్ష్మి. ఈ వ్యవహారంతో తనకు ఏమాత్రం సంబంధం లేకపోయిన కళ్లముందే దొంగతనం జరుగుతుండటంతో చూస్తు ఊరుకోలేకపోయారామె. తెగువతో ముందుకువచ్చి ఎంతో చాకచక్యంగా వ్యవహరించిన ఆమె దొంగల ముఠాలోని ఓ మహిళను పట్టకుని పోలీసులకు అప్పగించారు... దీంతో ఈ చీరల దొంగల గ్యాంగ్ మొత్తం పట్టుబడింది.  

వివరాల్లోకి వెళితే... విజయవాడ బందరు రోడ్డులోని గోలి హ్యాండ్లూమ్స్ లో షాపింగ్ చేసేందుకు వెళ్లారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి కూతురు కృపాలక్ష్మి. ఆమె చీరలు చూస్తుండగా కొందరు మహిళలు ఆ షాప్ లోకి ఎంటర్ అయ్యారు. చాలా హడావిడి చేస్తూ ఖరీదైన చీరలు చూపించాలని సేల్స్ మెన్స్ కోరుతూ తమ చేతివాటం ప్రదర్శించారు. షాప్ సిబ్బంది కళ్లుగప్పి ఖరీదైన చీరలు దొంగతనం చేయసాగారు... ఇలా ఐదు చీరలను దాచుకున్నారు.    

Latest Videos

అయితే షాప్ సిబ్బంది గమనించకపోయినా ఉపముఖ్యమంత్రి కూతురు మాత్రం ఈ చీరల దొంగతనాన్ని గమనించారు. వెంటనే ఆమె దొంగల ముఠాను అడ్డకునేందుకు సిద్దమయ్యారు. చీరలతో షాప్ బయటకు వచ్చేసిన మహిళలను అడ్డుకోగా విషయం అందరూ పరారయ్యారు. కానీ ఓ మహిళను మాత్రం కృపాలక్ష్మి పట్టుకున్నారు. 

అప్పటికే చీరల దొంగతనాన్ని సిసి కెమెరా ద్వారా  గుర్తించిన షాప్ యజమాని సిబ్బందిని అలర్ట్ చేసారు. వారు బయటకు వెళ్ళిచూడగా డిప్యూటీ సీఎం కూతురు ఓ మహిళను అడ్డుకోవడం గమనించారు. ఆ మహిళా దొంగను షాప్ లోకి తీసుకెళ్లి పోలీసులకు సమాచారం అందించారు. 

వీడియో

సదరు చీరల దొంగను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ గ్యాంగ్ వివరాలను సేకరించారు. ఈ సమాచారంతో మిగతా మహిళలను కూడా పోలీసులు పట్టుకున్నారు. ఇలా మొత్తం ఐదుగురు చీరల దొంగలను పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. వారు దొంగిలించిన చీరలను తిరిగి షాప్ లో అప్పగించారు. 

మహిళా దొంగలను అడ్డుకుని నష్టం జరక్కుండా చూసిన డిప్యూటీ సీఎం కూతురు కృపాలక్ష్మికి షాప్ యజమాని కృతజ్ఞతలు తెలిపారు. ఆమె ధైర్యంగా దొంగలను ఎదిరించడం గురించి తెలిసి స్థానికులు అభినందిస్తున్నారు. 

click me!