
చంద్రబాబునాయుడుకు న్యాయవ్యవస్ధతో ఉన్న అనుబంధం గురించి అందరికి తెలిసిందే. దశాబ్దాల పాటు ఈ విషయాన్ని అందరూ ఆఫ్ ది రికార్డుగానే మాట్లాడుకుంటారు. చివరకు ప్రతిపక్షాలు కూడా ఈ విషయంపై బహిరంగంగా ఆరోపించవు. ఎందుకంటే, ఆరోపణలకు ఆధారాలు చూపించలేరు కాబట్టి. అటువంటిది చంద్రబాబు-న్యాయవ్యవస్ధ మధ్య సంబంధాన్ని ‘ఎకనామిక్ టైమ్స్’ బయటపెట్టింది. ఈటి వెబ్ సైట్ లో మంగళవారం ప్రత్యేక కథనాన్ని ప్రచురించటం గమనార్హం.
ఈటీ కథనం మొత్తం ఉమ్మడి రాజధాని హైదరాబాద హైకోర్టులోని ఆరుగురు సీనియర్ న్యాయవాదులను జడ్జీలుగా నియమించటంపైనే తిరిగింది. జడ్జిల నియామకాన్ని సుప్రింకోర్టు కొలీజియం నిర్ణయిస్తుందన్న విషయం తెలిసిందే. కొలీజియం నిర్ణయంలో ఒక సభ్యుని అనవసర జోక్యంపై మరో సభ్యుడు అప్పటి ఛీఫ్ జస్టిస్ కు రాసిన లేఖ ద్వారా బయటపడింది. సదరు సభ్యుడు ఛీప్ జస్టిస్ కు లేఖ రాస్తూ, ‘ సీనియర్ సభ్యుని జోక్యం వల్ల శాసనసవ్యవస్ధ, న్యాయవ్యవస్ధ మధ్య ఉండకూడని సాన్నిహిత్యం కనబడుతోంది’ అంటూ వ్యాఖ్యానించారు. ఆ జోక్యం కూడా సీనియర్ న్యాయవాదులను జడ్జీలుగా నియమించటంపైనే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
సరే, జడ్జిల నియామకంలో కొలీజియంలోని సభ్యుడు జస్టిస్ ఎన్వి రమణ జోక్యాన్ని మరో సీనియర్ సభ్యుడు జాస్తి చలమేశ్వర్ సూచనగా లేఖలో పేర్కొన్నారు. ఆరుగురు న్యాయవాదుల నియామకంపై చంద్రబాబు అభ్యంతరాలను వ్యక్తం చేసారు. చలమేశ్వర్ రాసిన లేఖలో ‘అప్పటి జడ్జికి, ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబుకున్న సాన్నిహిత్యం అందరికీ తెలిసిందే’ అంటూ పేర్కొన్నారు.
జడ్జిల నియామకంపై చంద్రబాబు, జస్టిస్ ఎన్వీ రమణ లేవనెత్తిన అభ్యంతరాలు ఒకే విధంగా ఉన్నాయంటూ జస్టిస్ చలమేశ్వర్ ప్రస్తావించారు. వారిద్దరూ ఒకరితో మరొకరు టచ్ లో ఉండటమే ఇందుకు కారణంగా చలమేశ్వర్ అభిప్రాయపడ్డారు. ఇదే విషయమై జస్టిస్ రమణ ఈటితో మాట్లాడుతూ, ‘జడ్జిల నియామకంపై ఛీఫ్ జస్టిస్ ఖేహార్ తన అభిప్రాయాలను అడిగినపుడు తాను చెప్పాన’ని పేర్కొన్నారు. అదే సమయంలో ఏపి, తెలంగాణా ముఖ్యమంత్రుల అభిప్రాయాల గురించి తనకేమీ తెలీదని కూడా చెప్పారు. ఇదే విషయమై చంద్రబాబుతో మాట్లాడేందుకు ఈటీ ప్రయత్నించగా ఎవరూ అందుబాటులోకి రాలదేని కూడా ఈటీ పేర్కొంది.
జడ్జిల నియామకంపై ఇద్దరు ముఖ్యమంత్రుల అభిప్రాయాలను కోరగా కెసిఆర్ ప్రతిపాదనలు అందిన నెలకంతా తన అభిప్రాయాలను చెప్పారు. అయితే, చంద్రబాబు మాత్రం 11 నెలల తర్వాత మాత్రమే తన అభిప్రాయాలను చెప్పటం గమనార్హం. సరే. రమణ జోక్యం సంగతి ఎలావున్నా అప్పటి ఛీప్ జస్టిస్ ఖేహార్ మాత్రం చలమేశ్వర్ నిర్ణయాన్నే సమర్ధించారు. జస్టిస్ ఖేహార్ రమణ అభ్యంతరాలను ఏమాత్రం ఖాతరు చేయలేదని కూడా సమాచారం.
తాజాగా వెలుగు చూసిన లేఖతో చంద్రబాబు-న్యాయవస్ధ మధ్య సంబంధాలపై సర్వత్రా చర్చ మొదలైంది. న్యాయస్ధానాల్లో చంద్రబాబుపై ఉన్న అనేక కేసులు సంవత్సరాల తరబడి స్టేల రూపంలోనే పడివుండటం అందరికీ తెలిసిందే. దేశంలో సంచలనం కలిగించిన ‘ఓటుకునోటు’ కేసులో కూడా విచారణ ముందుకు సాగకుండా ఆగిపోవటంపై ఇప్పటికే అనేక ఆరోపణలున్నాయి.అటువంటి ఆరోపణలకు తాజాగా జస్టిస్ చలమేశ్వర్ రాసిన లేఖ మద్దతుగా కనబడుతోంది.
మరెన్నో తాజా వార్తల కోసం క్లిక్ చేయండి https://goo.gl/UR95BM