
నంద్యాల ఉపఎన్నిక వైసీపీకి ఓ మయసభ లాగ మారిపోయింది. ప్రచారం మొదలుపెట్టినప్పటి నుండి జగన్ సమావేశాలకు జనాలే జనాలు. మొదటగా 3వ తేదీ జరిగిన బహిరంగ సభకు జనాలు విరగబడ్డారు. దాంతో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. అంతమంది జనాలు వచ్చారంటే విజయం మనదే అనుకున్నారు. ఓ వారం తర్వాత రోడ్డుషోలు మొదలుపెట్టారు. ఎక్కడ జగన్ పాల్గొంటే అక్కడల్లా ఇసుకేస్తే రాలనంత జనాలు. శిల్పా విజయం ఖాయమనుకున్నారు. రోడ్డుషోల్లో కూడా జనాలు జగన్ ప్రసంగాలకు సానుకూలంగానే స్పందించారు.
చంద్రబాబు పాలనపై జగన్ అడిగిన ప్రశ్నలకు జనాలు అదిరిపోయేట్లు సమాధానాలిచ్చారు. దాంతో జనాలందరికీ చంద్రబాబు ప్రభుత్వంపై ఎంత మంటుందో వైసీపీ నేతలు అంచనా వేసుకున్నారు. చివరకు వర్షంలో కూడా జగన్ కోసం జనాలు ఎదురు చూసిన విషయం అందరికీ తెలిసిందే కదా? ఇక, పోలింగ్ రోజంటారా? నంద్యాల చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా జనాలు పోలింగ్ బూత్ ల వద్దకు ఉరుకులుపరుగుల మీద వచ్చారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలవుతుందంటే, గంటముందే వచ్చి కూర్చున్నారు.
ఆడ, మగ, పిల్లా, పెద్దా, ఇలా...ఒకరేంటి అందరూ పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరారు. ప్రభుత్వంపై వ్యతిరేకతుంది కాబట్టే జనాల్లో అంత చైతన్యమొచ్చిందని అందరూ అంచనా వేసారు. ఇంకేముంది ఎంతలేదన్నా వైసీపీకి 20 వేలు మెజారిటీ ఖాయమనుకున్నారు. దీనికి తోడు పోలింగ్ సందర్భంగా వెయ్యికోట్ల రూపాయల మేరకు బెట్టింగులు కూడా జోరందుకుంది. వైసీపీకి అనుకూలంగా వందల కోట్లు బెట్టింగులు జరుగుతున్నాయంటే ఇక కౌంటిగ్ మొదలుపెట్టటమే ఆలస్యమనుకున్నారు అందరూ.
అందరూ అనుకున్నట్లే కౌంటింగ్ మొదలైంది. కానీ సీన్ మొత్తం రివర్స్. మొదటి రౌండ్ నుండి ఇంకా స్పష్టంగా చెప్పాలంటే పోస్టల్ బ్యాలెట్ నుండే బొమ్మ తిరగబడింది. తమకొస్తుందనుకున్నమెజారిటీ మొదటిరౌండ్ నుండి టిడిపికి వస్తోంది. చూస్తుండగానే రౌండ్లూ పూర్తవుతున్నాయి, టిడిపి మెజారిటీ కూడా పెరుగుతోంది. చివరకు 19 రౌండ్లు అయ్యేటప్పటికి భూమా బ్రహ్మానందరెడ్డికి 97 వేల ఓట్లు పోలయ్యాయి.
అంటే అర్ధమేంటి? జగన్ బహిరంగసభకు వచ్చిన జనాలందరూ వైసీపీకి ఓట్లేయలేదు. రోడ్డుషోల్లో పాల్గొన్న ఓటర్లలో అత్యధికులు టిడిపికి ఓట్లేసినట్లున్నారు. జగన్ వద్ద చంద్రబాబు ప్రభుత్వాన్ని తిడుతూనే టిడిపి అభ్యర్ధికి ఓట్లు గుద్దారు. ఇక, ఉదయాన్నే ఉరుకులుపరుగుల మీద పోలింగ్ బూత్ లకు చేరుకున్నది జగన్ కోసం కాదని టిడిపికి ఓట్లేసేందుకేనని కౌటింగ్ తర్వాత అర్ధమైంది. అందుకే నంద్యాల ఉపఎన్నిక వైసీపీకి ఓ మయసభను తలపించింది.