అమిత్ షాపై దాడి: తెలుగు తమ్ముళ్లపై చంద్రబాబు ఆగ్రహం

First Published May 11, 2018, 3:19 PM IST
Highlights

శ్రీవారి దర్శనానికి వచ్చిన బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కాన్వాయ్ ని అలిపిరిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అడ్డుకుని ఆందోళనకు దిగడాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఖండించారు.

అమరావతి: శ్రీవారి దర్శనానికి వచ్చిన బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కాన్వాయ్ ని అలిపిరిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అడ్డుకుని ఆందోళనకు దిగడాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఖండించారు. పార్టీ కార్యకర్తల తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కారాదని ఆదేశించారు. 

 క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హెచ్చరించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరిగి వెళ్తున్న సమయంలో అమిత్ షా కారును అలిపిరి గరుడ సర్కిల్ దగ్గర అడ్డుకునేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు. 

అమిత్‌ షా కాన్వాయ్‌లో బీజేపీ నాయకులు కారు నుంచి దిగారు. టీడీపీ నేతలపై బీజేపీ నేతలు కూడా దాడి చేసినట్లు చెబుతున్నారు. ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. టీడీపీ నేత గుణశేఖర్ నాయుడు తలకు గాయం కావడంతో ఆయనను రుయాకు తరలించారు.

విచారణ జరుపుతాం

అమిత్ షాను టీడీపీ కార్యకర్తలు అడ్డుకుని నిరసన తెలిపినట్లు వార్తలు వస్తున్నాయని హోంమంత్రి చినరాజప్ప అన్నారు. అలిపిరి ఘటనపై విచారణ జరుపుతామని ఆయన చెప్పారు.  హోదా కోసం ఏపీలో ప్రశాంతమైన ఉద్యమం జరుగుతుందని ఆయన అన్నారు. ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించేందుకు అనేక శక్తులు పనిచేస్తున్నాయని అన్నారు. సయంమనం పాటించాలని ఆయన కోరారు. 

శాంతి భద్రతలకు ఎవరూ విఘాతం కల్పించిన కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. షా కాన్వాయ్‌పై దాడి చేసినవారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే కాన్వాయపై రాళ్లదాడి జరగలేదని చెప్పారు.

దాడి జరగలేదు

తిరుపతిలో అమిత్ షా కాన్వాయ్‌పై దాడి జరగలేదని తెలుదేశం పార్టీ ఎమ్మెల్యే సుగుణమ్మ అన్నారు. అవసరమైతే సీసీ కెమెరాలు పరిశీలించుకోవచ్చని స్పష్టం చేశారు. టీడీపీ కార్యకర్తలపైనే బీజేపీ నేతలు, వాళ్ల అనుచరులు దాడి చేశారని ఆరోపించారు. టీడీపీ కార్యకర్తలు నల్లజెండాలతో నిరసన తెలుపుతున్న సమయంలో అమిత్ షా కాన్వాయ్‌ వెళ్లిందని చెప్పారు. 

కాన్వాయ్ వెళ్లగానే బీజేపీ నేతలు వచ్చి దాడి చేశారని తెలిపారు. శ్రీకాళహస్తికి చెందిన బీజేపీ నేత కోలా ఆనంద్‌ అనుచరులు.. గడ్డం ఉన్న మరో వ్యక్తి జెండా కర్రలతో టీడీపీ శ్రేణులపై దాడి చేశారని వెల్లడించారు. బీజేపీ నేతలు చేసిన పనికి టీడీపీ కార్యకర్తలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని సుగుణమ్మ చెప్పారు.

రాళ్లదాడి దురదృష్టకరం

అమరావతి: తిరుపతిలో అమిత్ షా కాన్వాయ్‌పై రాళ్లదాడి దురదృష్టకరమని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర హక్కుల కోసం పోరాడితే అంతు చూస్తామంటూ ఎంపీ జీవీఎల్ ఏ విధంగా వ్యాఖ్యలు చేస్తారని ప్రశ్నించారు. 

పన్నెండు కేసులున్న జగన్ జోలికెళ్లరా అని కూడా అడిగారు. బీజేపీ నేతల వ్యాఖ్యలను కర్ణాటక ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. 

click me!