ఎన్నికలకు రెడీ: కేసీఆర్ ను కాపీ కొడుతున్న చంద్రబాబు

First Published May 11, 2018, 1:52 PM IST
Highlights

తెలుగుదేశం పార్టీ అద్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లే కనిపిస్తున్నారు.

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అద్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లే కనిపిస్తున్నారు. శుక్రవారం జరిగిన టీడీపి విస్తృత స్థాయి సమావేశంలో ఆయన చేసిన ప్రసంగం, ఇచ్చిన హామీలు ఆ విషయాన్ని పట్టిస్తున్నాయి. 

వచ్చే ఎన్నికల్లో టీడీపి గెలవడం చారిత్రాకవసరమని చెప్పిన చంద్రబాబు విజయం సాధించడానికి తగిన హామీలను ఇవ్వడానికి సిద్ధపడినట్లు కనిపిస్తున్నారు. ఈ విషయంలో ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును కాపీ కొడుతున్నట్లు కనిపిస్తున్నారు. 

ప్రతి ఇంటికీ కుళాయి ఇస్తామని, నీళ్లు మోసుకెళ్లే భారాన్ని మహిళలకు లేకుండా చేస్తామని చంద్రబాబు చెప్పారు. ఈ పథకాన్ని మిషన్ భగరీథ పేరిట తెలంగాణలో కేసిఆర్ అమలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల లోపు ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ ద్వారా నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు కూడా అడగబోమని కేసిఆర్ చెప్పి, ఆ పథకాన్ని అమలు చేస్తున్నారు. 

మిషన్ భగీరథను పూర్తి చేసి, వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని కేసిఆర్ అనుకుంటుంటే, ఆ పథకాన్ని ప్రకటించి వచ్చే ఎన్నికల్లో సానుకూల వాతావరణాన్ని సృష్టించుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. 

ఇక, ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కోరామని చంద్రబాబు అన్నారు. రైతు బంధు పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేసిఆర్ గురువారం అదే డిమాండ్ పెట్టారు. కేంద్రం సహకరించకున్నా రైతులను ఆదుకుంటున్నామని చెప్పారు. 

అలాగే, కొత్త పింఛను విధానాన్ని కూడా ప్రవేశపెడుతామని చంద్రబాబు చెప్పారు. వచ్చే నెల నుంచి దీన్ని అమలు చేస్తామని చెప్పారు. అర్హులందరికీ పింఛన్లు అందేలా చూస్తామని చెప్పారు. నవనిర్మాణ దీక్ష సందర్భంగా కొత్త పెన్షన్లను మంజూరు చేస్తామని చెప్పారు. 

తనతో పాటు ప్రతి ఒక్కరూ పనితీరును సమీక్షించుకోవాలని చంద్రబాబు అన్నారు. నాలుగేళ్లలో పాలను గాడిలో పెట్టామని చెప్పారు. కొందరు అధికారుల తీరు ఇబ్బందికరంగా ఉందని అన్నారు. తప్పులు చేసే అధికారులు లూప్ లైన్లోనే ఉంటారని హెచ్చరించారు.

పాలనలో పొరపాట్లు జరిగితే అధికారులకు పోయేదేమీ లేదని, వారికి 30 ఏళ్ల పాటు ఏ విధమైన ఇబ్బంది ఉండదని, తామే ఐదేళ్లకోసారి ప్రజల ముందుకు వెళ్లాల్సి వస్తుందని ఆయన అన్నారు.

click me!