
తెలుగుదేశం పార్టీ అధినేత నేడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఢిల్లీలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చంద్రబాబు ఈ రోజు ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. అయితే చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో విజయవాడ ఎంపీ కేశినేని నాని ముభావంగా కనిపించినట్టుగా వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు ఢిల్లీ చేరుకోగానే.. ఎయిర్‌పోర్ట్‌లో టీడీపీ ఎంపీలు ఆయనకు స్వాగతం పలికారు. చంద్రబాబుకు ఎంపీలు సన్మానం చేసి, పుష్పగుచ్చం ఇచ్చారు. అయితే చంద్రబాబుకు పుష్పగుచ్చం ఇవ్వాల్సిందిగా మరో ఎంపీ గల్లా జయదేవ్.. కేశినేని నానిని కోరారు. అయితే నాని మాత్రమే మీరే ఇవ్వండనేలా.. పుష్పగుచ్చాని విసురుగా తోసేశారు. అక్కడున్న వారంతా కొద్దిగా షాక్ అయ్యారు.
ఆ తర్వాత కూడా కేశినేని నాని చంద్రబాబుకు దూరం దూరంగానే ఉన్నట్టుగా కనిపించింది. ప్రస్తుతం ఈ ఘటన టీడీపీలోనే కాకుండా.. రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే గత కొంతకాలంగా చంద్రబాబు తీరుపై కేశినేని నాని అసంతృప్తితో ఉన్నట్టుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తన సోదురుడు కేశినేని శివనాథ్‌ను (చిన్ని) చంద్రబాబు ప్రోత్సహిస్తున్నాడనే అసంతృప్తిలో కేశినాని నాని ఉన్నట్టుగా గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి.
విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తన కూతురును శ్వేతను టీడీపీ మేయర్ అభ్యర్థిగా ప్రకటించేలా చేయడంలో కేశినేని నాని విజయం సాధించారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఓటమి చవిచూసింది. అయితే పార్టీకి నష్టం జరగడానికి టీడీపీ నేతలు బోండా ఉమ, నాగుల్‌మీరా కారణమని కేశినేని నాని ఆగ్రహంతో ఉన్నారు. దీనిపై చంద్రబాబుకు ఫిర్యాదు చేసిన ఆయన చర్యలు తీసుకోలేదని గుర్రుగా ఉంటూ వస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించి కేశినేని నాని బహిరంగంగా ఎలాంటి కామెంట్స్ చేయకపోయినప్పటికీ.. మీడియా చిట్ చాట్‌లతో పాటు, తన సన్నిహితుల వద్ద కీలక కామెంట్స్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. మరోవైపు చంద్రబాబు తన సోదరుడు చిన్నిని ప్రోత్సహిస్తున్నారని భావిస్తున్న కేశినేని నాని అసంతృప్తితో ఉన్నారు.
Also Read: ప్రధాని మోదీ సమావేశానికి చంద్రబాబు.. దూరంగా తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్ ,కేసీఆర్..
అయితే ఇటీవల జరిగిన కేశినేని నాని కుమార్తె శ్వేత నిశ్చితార్థ వేడుకకు.. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లతో టీడీపీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు, నానిలు సన్నిహితంగా ఉన్నట్టుగానే కనిపించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. ఇక, తన భార్య, కొడుకుతో కలిసి నారా లోకేష్ నిశ్చితార్థ వేడుకకు హాజరు కాగా.. కేశినేని నాని ఆయనకు చేయి పట్టుకుని వేదిక వద్దకు తీసుకెళ్లారు. అయితే అది జరిగి వారం రోజులు కూడా కాకముందే.. చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో కేశినేని నాని ముభావంగా కనిపించినట్టుగా వార్తలు రావడంతో ఏం జరిగి ఉంటుందని టీడీపీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి.