
విజయనగరం జిల్లా కురుపాం (kurapam) లోని ప్రభుత్వ వసతిగృహంలోని విద్యార్ధి పాము కాటుకు గురై మృతిచెందిన ఘటనపై టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు (chandrababu naidu) స్పందించారు. ప్రభుత్వ నిర్వహణలోని హాస్టల్ లోకి పాము ప్రవేశించి విద్యార్థులను కాటేయడం చాలా ఆందోళన కలిగించే ఘటన అని ఆవేదన వ్యక్తం చేసారు. ఎంతో ఉజ్వల భవిష్యత్తు కలిగిన విద్యార్ధులు కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని చంద్రబాబు మండిపడ్డారు.
''గతంలో వసతి గృహాల్లో ఉండే వసతి సదుపాయాలు, ఉపాధ్యాయుల పర్యవేక్షణ చూసి సీట్ల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు ఎగబడేవారు. కానీ ఈ రోజు ప్రాణాలతో ఉండాలంటే వసతి గృహాల్లో చేరకుండా ఉంటే మేలు అనే పరిస్థితికి జగన్ రెడ్డి దిగజార్చారు. పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య అందించాల్సిన వసతి గృహాల్లో సదుపాయాల లేమి, భద్రత లేమి చూసి విద్యార్ధులు, తల్లిదండ్రులు భయపడే పరిస్థితి కల్పించారు. కురుపాంలో జరిగిన ఘటనకు ముఖ్యమంత్రే బాధ్యత వహించాలి. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలి'' అని చంద్రబాబు డిమాండ్ చేసారు.
వసతిగృహ విద్యార్థుల పాముకాటు ఘటనపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (nara lokesh) కూడా స్పందించారు. కురుపాం మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ గురుకుల బాలుర పాఠశాలలో నిద్రిస్తున్న 8వ తరగతి విద్యార్థుల్ని పాము కాటు వేసిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని లోకేష్ పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం పుష్పశ్రీ వాణి సొంత నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితి వుంటే మిగతాచోట్ల హాస్టల్స్ పరిస్థితి మరింత దారుణంగా వుందోనని లోకేష్ ఆందోళన వ్యక్తం చేసారు.
''వైసిపి ప్రభుత్వ నిర్లక్ష్యంతో బంగారు భవిష్యత్తు వున్న విద్యార్థి మృతి చెందడం... ఇద్దరి పరిస్థితి విషమంగా వుండటం తీవ్ర విచారకరం. విద్యార్థులకి మెరుగైన చికిత్స అందించాలి. బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. పిల్లల్ని సురక్షితంగా చూసుకోవాల్సిన గురుకులాలను జగన్ రెడ్డి సర్కారు పట్టించుకోకపోవడంతో మృత్యుకేంద్రాలు కావడం రాష్ట్రంలో విద్యావ్యవస్థ దుస్థితికి నిదర్శనం'' అని లోకేష్ మండిపడ్డారు.
ఏం జరిగిందంటే:
విజయనగరం జిల్లా కురపాంలోని జ్యోతిబాపులే బిసి వెల్ఫేర్ రెసిడెన్షియల్లో బెడ్స్ లేవు. దీంతో విద్యార్థులంతా రాత్రి పూట నేలపైనే నిద్రిస్తారు. అయితే గురువారం రాత్రి కూడా ఇలాగే విద్యార్థులు నేలపై నిద్రిస్తుండగా ఎక్కడినుండో హాస్టల్లోకి ప్రవేశించిన విష సర్పం ముగ్గురిని కాటేసింది. ఇలా పాముకాటుకు గురైన విద్యార్ధుల్లో వంశీ అనే విద్యార్ధి మరణించారు. మిగతా ఇద్దరు విద్యార్ధుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు.
8వ తరగతికి చెందిన మంతిని రంజిత్, ఈదుబుల్లి వంశీ, వంగపండు నవీన్ పాముకాటుకు గురయినట్లు తెలియగానే హాస్టల్ సిబ్బంది హుటాహుటిన హాస్పిటల్ కు తరలించారు. అలా తరలిస్తుండగానే వంశీ మృతిచెందాడు. మిగతా ఇద్దరినీ మెరుగైన వైద్యం కోసం విశాఖ ఆసుపత్రికి తరలించారు. విద్యార్ధులను కాటేసిన పామును హాస్టల్ సిబ్బంది చంపేశారు.
బీసీ రెసిడెన్షియల్ స్కూల్ లో సిబ్బంది ఆజమాయిషీ సరిగా లేని కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకొందని విద్యార్ధుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యార్ధులను కాటేసిన పామును సిబ్బంది చంపేశారు.మరో వైపు గురుకుల స్కూల్ విద్యార్ధి మరణానికి స్కూల్ లో పనిచేసే సిబ్బందే కారణమని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.