Latest Videos

చాగంటి కోటేశ్వరరావు సంచలన నిర్ణయం.. టీటీడీ ధర్మప్రచార పరిషత్ సలహాదారు పదవి తిరస్కరణ

By Siva KodatiFirst Published Mar 4, 2023, 7:21 PM IST
Highlights

టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ సలహాదారు పదవిని ప్రముఖ ప్రవచనకర్త , బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు తిరస్కరించారు. టీటీడీకి తన అవసరం వచ్చినప్పుడు తప్పకుండా ముందు వుంటానని కోటేశ్వరరావు అన్నారు. 

ప్రముఖ ప్రవచనకర్త , బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ సలహాదారు పదవిని ఆయన తిరస్కరించారు . ఈ సందర్భంగా చాగంటి కీలక వ్యాఖ్యలు చేశారు. టీటీడీకి సలహాలు ఇవ్వడానికి తనకు పదవులు అవసరం లేదని కోటేశ్వరరావు తెలిపారు. వెంకటేశ్వరరస్వామే తన ఊపిరి అని చాగంటి స్పష్టం చేశారు. టీటీడీకి తన అవసరం వచ్చినప్పుడు తప్పకుండా ముందు వుంటానని కోటేశ్వరరావు అన్నారు. 

కాగా.. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధార్మిక కార్యకలాపాలకు సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావును నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. జనవరి 21న జరిగిన హిందూ ధర్మ ప్రచార పరిషత్ (హెచ్‌డీపీపీ), శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్‌వీబీసీ) ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించిన అనంతరం టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఈ మేరకు ప్రకటన చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ కార్యనిర్వహణాధికారి ఏవీ ధర్మారెడ్డి, జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సదా భార్గవి, ఎస్వీబీసీ చైర్మన్ సాయికృష్ణ యాచేంద్ర తదితరులు పాల్గొన్నారు. గత మూడు సంవత్సరాలలో టీటీడీ నిర్వహించిన ‘పారాయణం’ కార్యక్రమాల ఆధారంగా ఈ నియామకం జరిగిందని పేర్కొన్నారు. హిందూ ధర్మ ప్రచారాన్ని మారుమూల గ్రామాల్లోకి తీసుకెళ్లాలనే లక్ష్యంతో గ్రామీణ యువతను ఈ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని నిర్ణయించారు.

ఇందులో భాగంగా మానవాళి శ్రేయస్సు కోసం దైవిక జోక్యాన్ని కోరుతూ వివిధ ప్రదేశాలలో యాగాలు, హోమాలు నిర్వహిస్తామని, భక్తి కార్యక్రమాలు నిర్వహించేందుకు గ్రామస్తులకు భజన, కోలాటం సామాగ్రిని అందిస్తామని చైర్మన్ పేర్కొన్నారు. కాగా..కొండపైన టీటీడీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై తిరుమలకు తరలివస్తున్న భక్తుల అనుభవాలను ప్రసారం చేయాలని ఎస్వీబీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయించింది. సామాజిక కోణంలో టీటీడీ నిర్వహించే కార్యక్రమాలు, దాని ఛారిటబుల్ ఆసుపత్రుల ద్వారా ఉచితంగా నిర్వహించే సంక్లిష్టమైన, ఖరీదైన శస్త్రచికిత్సలు కూడా తమ ఛానెల్‌లో ప్రసారం చేయాలని నిర్ణయించారు. 

click me!