చంద్రబాబుది ఇక ప్రేక్షక పాత్రేనా ?

First Published Dec 21, 2017, 11:15 AM IST
Highlights
  • రేపటి ఎన్నికల్లో పోలవరం ప్రాజెక్టును ఓ అస్త్రంగా ఉపయోగించుకునేందుకు కేంద్రం గట్టి వ్యూహాలనే పన్నుతోందా ? 

రేపటి ఎన్నికల్లో పోలవరం ప్రాజెక్టును ఓ అస్త్రంగా ఉపయోగించుకునేందుకు కేంద్రం గట్టి వ్యూహాలనే పన్నుతోంది. అందులో భాగంగానే ముందుజాగ్రత్తగా ప్రాజెక్టు పర్యవేక్షణ మొత్తాన్ని తన చేతిల్లోకి తీసుకుంటోంది. ఇప్పటికే ప్రాజెక్టు పనుల పర్యవేక్షణకు నాలుగు కమిటీలుండగా తాజాగా మరో కమిటీని వేయటమే అందుకు సంకేతాలుగా కనిపిస్తున్నాయ్. వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒంటిరిగా పోటీ చేయాలని నిర్ణయించుకుంటే అప్పుడు పోలవరాన్ని ఎన్నికల అస్త్రంగా ఉపయోగించుకోవాలని భాజపా భావిస్తున్నట్లు కనబడుతోంది.

పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబునాయుడును కేంద్రప్రభుత్వం మెల్లిగా పక్కకు తప్పిస్తోందా? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే అందరిలోనూ అవే అనుమానాలు మొదలవుతున్నాయి. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు పర్యవేక్షణకు కేంద్రం తరపున అనేక కమిటీలున్నాయి. సిడబ్ల్యుసి, సిపిఏ, త్రిమ్యాన్ కమిటి, నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ కమిటిలు ఎప్పటికప్పుడు ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. పై కమిటీలన్నీ పోలవరం ప్రాజెక్టు అథారిటీ పరిధిలో పనిచేస్తున్నాయి. వాటికి అదనంగా వాప్కోస్ కన్సెల్టెన్సీని కేంద్రం నియమించింది. ఈ కమిటీనే రెండు రోజులుగా ప్రజెక్టు పనులను క్షేత్రస్ధాయిలో పరిశీలిస్తోంది.

అసలు ఇన్ని కమిటీల అవసరం ఏంటి? ఇక్కడే కేంద్రం వైఖరి పరోక్షంగా అర్ధమవుతోంది. ప్రాజెక్టు పనుల్లో భారీగా అవినీతి చోటు చేసుకుందనే ఆరోపణలు కేంద్రానికి చేరింది. దానికితోడు కేంద్రం విడుదల చేసిన నిధులకు లెక్కలు చెప్పమంటే రాష్ట్రప్రభుత్వం చెప్పటం లేదు. అందుకని కేంద్రం నిధుల విడుదలను నిలిపేసింది. దాంతో రాష్ట్రం మొక్కుబడిగా ఏవో లెక్కలను పంపింది.

సమస్య అంతా ఇక్కడే మొదలైంది. కేంద్రం లెక్కలకు, రాష్ట్ర ప్రభుత్వం పంపిన నివేదికలోని లెక్కలకు తేడా ఉందని స్వయంగా కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి అరుణ్ జైట్లీనే వ్యాఖ్యానించారంటే పరిస్ధితేంటో అర్ధమవుతోంది. అందుకే, పోలవరం ప్రాజెక్టు పనులను ఇక నుండి తానే ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తానంటూ గడ్కరీ కూడా స్పష్టం చేసారు. అందే అర్ధమేంటి? ప్రాజెక్టు పర్యవేక్షణ నుండి చంద్రబాబును తప్పిస్తున్నట్లే. ఎందుకంటే, మొన్నటి వరకూ ప్రాజెక్టు పనుల్లో మొత్తం తానే అయి చంద్రబాబు వ్యవహరించిన సంగతి అందరికీ తెలిసిందే. బహుశా ఇక నుండి చంద్రబాబు ప్రేక్షకపాత్రకు మాత్రమే పరిమితమవ్వక తప్పదేమో?

 

click me!