
కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ చిక్కుల్లో పడినట్లే. తన విద్యార్హతలకు సంబంధించి స్మృతీ సమర్పించిన అఫిడవిట్లలో వేర్వేరుగా పేర్కొనటంపై ఇబ్బందులు మొదలయ్యాయి. స్మృతిది నకిలీ సర్టిఫికేట్లని పలువురు అనుమాన పడుతున్నారు. 2004 ఎన్నికల సమయంలో ఢిల్లీ యూనివర్సిటీ నుండి బిఏ పాసైనట్లు ఇరానీ పేర్కొన్నారు. అనంతరం జరిగిన వేరే ఎన్నికల్లో బికాం కరెస్పాండెన్స్ కోర్సు చేసినట్లు అదే ఇరానీ అఫిడవిట్లో పేర్కొనటంతో రచ్చ మొదలైంది. తప్పుడు ధృవపత్రాలతో డిగ్రీ చదివినిట్లుగా అబద్దాలు చెబుతున్నారంటూ ఆర్టిఐ సామాజిక కార్యకర్తలు పలువురు న్యాయస్ధానాల్లో కేసులు వేసారు.
గత ఏడాది వేసిన కేసుల్లో సరైనా ఆధారాలు లేవంటూ ఢిల్లీ దిగువ కోర్టు కేంద్రమంత్రిపై దాఖలైన కేసును కొట్టేసింది. అయితే, దాన్ని సవాలు చేస్తూ అహ్మద్ ఖాన్ అనే వ్యక్తి ఢిల్లీలో వేసిన కేసును విచారణకు స్వీకరించింది. రెండు ఎన్నికల్లో అఫిడవిట్లలో స్మృతీ రెండు వేర్వేరు విద్యార్హతలను పేర్కొన్నట్లు ఖాన్ తన పిటీషన్లో ఆరోపించారు. పిటీషనర్ వాదనను విన్న తర్వాత హై కోర్టు స్మృతికి సంబంధించిన అన్నీ విద్యార్హత సర్టిఫికేట్లను కోర్టుకు సమర్పించాలంటూ ఆదేశించింది.
ఢిల్లీ ప్రభుత్వంలోని ఓ మంత్రిని ఇదే ఆరోపణలపై భాజపా కోర్టుకు ఈడ్చి నానా ఇబ్బంది పెడుతోంది. ఎవరో దాఖలు చేసారంటూ పోలీసు స్టేషన్లో కేసు కూడా నమోదు చేయటంతో పాటు అరెస్టు కూడా చేయించింది. అదే స్మృతి కేసు విషయంలో మాత్రం కేంద్రప్రభుత్వం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. ఆ మాట కొస్తే ప్రధానమంత్రి నరేంద్రమోడి విద్యార్హతల విషయంలో కూడా వివాదం నడుస్తోంది. నిజానికి రాజకీయాల్లో పదవులు అందుకోవటానికి విద్యార్హతలకు ఎటువంటి సంబంధం లేదు. కాకపోతే ప్రజాజీవితంలో ఉండే వారు పారదర్శకత పాటిస్తున్నారా లేదా అన్నదే ముఖ్యం.