
‘రాష్ట్రపతి ఎన్నికల తర్వాత జరిగే తమాషా చూడండి’ ...అని అమిత్ షా చేసిన వ్యాఖ్య ధక్షిణాది రాష్ట్రాల్లో ఎలాగున్నా ఏపిలో మాత్రం బాగా కాక పుట్టిస్తోంది. చంద్రబాబునాయుడులో బాగా ఆందోళన పెంచేస్తోందని సమాచారం. తెలంగాణాలో టిడిపి-భాజపాలు రెండూ ప్రతిపక్షంలోనే ఉన్నాయి. కాకపోతే టిడిపికన్నా భాజపా పరిస్ధితే మెరుగ్గా ఉంది. దానికితోడు ఎన్నికలైన దగ్గర నుండి కూడా రెండు పార్టీలు పెద్దగా కలిసింది కూడా లేదు.
అదే, ఏపి విషయానికొస్తే రెండూ అధికారాన్ని పంచుకుంటున్నాయి. అధికారం అందుకున్న తొలి రోజుల్లో మాత్రమే సఖ్యతగా ఉన్నాయి. తర్వాత నుండి రెండు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. దానిపైన వచ్చే ఎన్నికల్లో భాజపా ఒంటరిగా పోటీ చేస్తుందనే ప్రచారం బలంగా జరుగుతోంది. పైగా ఆ ప్రచారాన్ని భాజపా నేతలే చేస్తుండటం గమనార్హం. ఇటీవల జగన్-మోడి భేటీ తర్వాత అది మరింత పెరిగిపోయింది.
ఈ నేపధ్యంలోనే అమిత్ షా రెండు రాష్ట్రాల్లోనూ పర్యటిస్తున్నారు. తెలంగాణాలో మాట్లాడుతూ ‘రాష్ట్రపతి ఎన్నికల తర్వాత జరగబోయే తమాషా చూడండి’ అంటూ వ్యాఖ్యానించారు. తమాషా అంటే తమిళనాడు, కర్నాటక, కేరళ, తెలంగాణాలో భాజపా చేయగలిగిందేమీ లేదు. ఏమైనా చేయగలిగితే ఏపిలోనే. అంటే మిత్రపక్షంగా టిడిపి నుండి విడిపోవాలి. అదే జరిగితే, చంద్రబాబునాయుడుకు ఇబ్బందులు మొదలైనట్లే. స్ధానిక భాజపా నేతల్లో అత్యధికులు అదే కోరుకుంటున్నారు.
టిడిపితో కలిసున్నంత కాలం భాజపా ఎదిగే అవకాశాలు లేవని పలువురు నేతలు జాతీయ నాయకత్వానికి ఎప్పటి నుండో చెబుతున్నారు. బహుశా ఆ విషయంపైనే జాతీయ నాయకత్వం దృష్టి పెట్టిందేమో. జాప్యం జరిగే కొద్దీ టిడిపిపై ఉన్నప్రజా వ్యతిరేకత భాజపా కూడా భరించాల్సి వస్తుందని స్ధానిక నేతలు గట్టిగా చెబుతున్నారు. ఈ విషయంపై కేంద్ర నాయకత్వం కూడా సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. అందులో భాగమే వైసీపీ అధ్యక్షుడు జగన్ తో ప్రధానమంత్రి భేటీ అని తెలుస్తోంది. రాష్ట్రపతి ఎన్నికలు జూలైలో అయిపోతాయి. అమిత్ షా చెప్పినట్లు మరి ఆ తమాషా ఏంటో చూడాల్సిందే.