మరొక 25 ఐటి కంపెనీలొస్తున్నాయి అంధ్రాకు

First Published May 24, 2017, 9:13 AM IST
Highlights

రాష్ట్రంలో మరో 25 ఐటీ సంస్థలు; వచ్చే నెల నుంచి కార్యకలాపాలు; 
కొత్తగా 2,281 మందికి ఉద్యోగావకాశాలు; గడిచిన ఐదు నెలల్లో 89 ఐటీ కంపెనీలు రూ. 5,590 కోట్ల పెట్టుబడులు, 4,500 మందికి ఉద్యోగాలు

వచ్చే నెల నుంచి మరో 25 ఐటీ కంపెనీలు రాష్ట్రంలో కార్యకలాపాలు ప్రారంభించనున్నాయి. విశాఖపట్నం, తిరుపతి కేంద్రంగా ఏర్పాటవుతున్న ఈ సంస్థలతో 2,281 మందికి ఉద్యోగాలు రానున్నాయి. వెయ్యి ఉద్యోగాలు కల్పించే మరో ఆరు ఐటీ కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధంగా వున్నాయి.

 

ఈ వివరాలను  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఒక  సమీక్షా సమావేశంలో అధికారులు వెల్లడించారు.

 

ఈ ఏడాది గడిచిన ఐదు నెలల్లో 89 ఐటీ కంపెనీలు రాష్ట్రంలో రూ. 5,590 కోట్ల పెట్టుబడులు పెట్టగా 4,500 మందికి ఉద్యోగాలు లభించినట్టు ముఖ్యమంత్రికి వివరించారు.  ఇటీవల అమెరికా పర్యటనలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరిచిన ఇన్నోవా, గ్లోబల్ ఫౌండరీస్, జునిపెర్, న్యుటానిక్స్, జోహో, సిస్కో, ఆల్ఫాబెట్, ఫెక్స్‌ట్రానిక్స్ వంటి సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపారు. 

 


ఫిన్‌టెక్ వ్యాలీని ప్రమోట్ చేసేందుకు ప్రతీ ఏటా ఇంటర్నేషన్ పిన్‌టెక్ ఈవెంట్ విశాఖలో నిర్వహించాలని సమీక్షలో నిర్ణయించారు. గ్లోబల్ ఫిన్‌టెక్ గమ్యస్థానాలైన సింగపూర్, లండన్, హాంగ్‌కాంగ్, టొరొంటో, న్యూయార్క్, టోక్యోలో విశాఖను విశ్వవ్యాప్తం చేసేలా రోడ్ షోలు జరపనున్నారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన ఫిన్‌టెక్ రెగ్యులేటరీ అడ్వయిజరీ బోర్డును ఏర్పాటు చేయాలని కూడా సమీక్షలో భావించారు. ఇ-ప్రగతి, ఇ-ఆఫీస్ నుంచి మీసేవ, కోర్ డ్యాష్ బోర్డు వరకు పలు అంశాలు చర్చకు వచ్చాయి. మీసేవ కింద 32 శాఖలకు సంబంధించి 314 సేవలు అందిస్తున్నామని, మొత్తం 5,603 మీ సేవా కేంద్రాలు అందుబాటులో వున్నాయని ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. మీసేవా కేంద్రాలను మరింత పెంచాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు. 
 

click me!