
కేంద్రప్రభుత్వం వివిధ పద్దతుల కింద ఇప్పటి వరకూ విడుదల చేసిన నిధులకు రాష్ట్ర ప్రభుత్వం ఆడిట్ చేసిన లెక్కల వివరాలు సమర్పించాలంటూ కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి వేసిన ఓ ప్రశ్నకు ఆర్ధికశాఖ సహాయమంత్రి అర్జున్ మేఘ్ వాల్ లిఖిత పూర్వక సమాధానిమిచ్చారు. గడచిన మూడేళ్ళుగా కేంద్రం వివిధ పద్దుల క్రింద రాష్ట్రానికి కోట్లాది రూపాయలు కేటాయించినట్లు సహాయమంత్రి పేర్కొన్నారు. అందుకున్న నిధులు, నిధుల వ్యయానికి సంబంధించిన ఆడిట్ లెక్కలు సమర్పిస్తే కానీ తదుపరి నిధులు విడుదల సాధ్యం కాదని స్పష్టం చేయటం గమనార్హం.
అలాగే, ఉపాధిహామీ పథకం క్రింద ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ఇప్పటి వరకూ రూ. 3285 కోట్లు విడుదల చేసినట్లు గ్రామీణాభివృద్ధిశాఖ సహాయమంత్రి రామ్ కృపాల్ యాదవ్ వివరించారు. కేంద్రం విడుదల చేసిన నిధులకు యుటిలైజేషన్ సర్టిఫికేట్ కూడా జతచేయాలని కేంద్రమంత్రులు స్పష్టంగా చెప్పారు. అయితే, ఇక్కడే సమస్య వస్తోంది. ఏంటంటే, కేంద్రం అనేక పద్దుల క్రింద కోట్ల రూపాయలను విడుదల చేసింది వాస్తవం. అదే పద్దతిలో రాష్ట్రం ఆ నిధులను ఖర్చు చేసిందీ వాస్తవమే.
అయితే కేంద్రం ఏ పద్దుల్లో ఖర్చు చేయాలని నిధులు విడుదల చేసిందో ఆ పద్దులకు చేసిన ఖర్చు మాత్రం చాలా తక్కువ. తనిష్టం వచ్చిన అవసరాలకు ప్రభుత్వం నిధులను వాడేసింది. ఉదాహరణకు రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కేటాయించిన కోట్లాది రూపాయలను రాష్ట్రప్రభుత్వం ‘నీరు-చెట్టు’ కార్యక్రమానికి వాడేసినట్లు ఆరోపణలున్నాయి. అదేవిధంగా రాజధాని నిర్మాణ ప్రాంతంలో మౌళిక సదుపాయల కల్పనకు కేటాయించిన నిధులను శంకుస్ధాపనలు తదితరాలకు వాడేసినట్లు సమాచారం. అంతేకాకుండా రుణమాఫీ తదితరాలకు కూడా వాడిందట.
కేంద్రం ఎప్పుడైతే యుటిలైజేషన్ సర్టిఫికేట్లు, ఆడిట్ లెక్కల కోసం పట్టుబడుతోందో అప్పటి నుండే సమస్యలు మొదలయ్యాయి. ఎందుకంటే, రాష్ట్రప్రభుత్వం లెక్కలను సమర్పించినా కేంద్రం గుడ్డిగా నమ్మదుకదా? దాని మార్గంలో కేంద్రం క్రాస్ చెక్ చేసుకుంటుంది. అప్పుడు లెక్కల్లోని లొసుగులు బయటపడుతుంది. అప్పుడు లెక్కలు తయారుచేసిన వారు ఇరుక్కుంటారు. ఒకవైపు కేంద్రం నిధుల లెక్కల కోసం పట్టుబడుతోంది. మరోవైపు నిధులు విడుదల కాక రాష్ట్రప్రభుత్వం అవస్తలు పడుతోంది. ఈ సమస్య ఎప్పుడు, ఎలా పరిష్కారం అవుతోందో ఏమో.