చేతులెత్తేసిన కంపెనీలు

First Published Dec 20, 2017, 6:26 AM IST
Highlights
  • పోలవరం ప్రాజెక్టుకు అరువుపై స్టీలు, సిమెంటు సరఫరా చేయటంపై కంపెనీల ప్రతినిధులు చేతెలెత్తేసారు.

పోలవరం ప్రాజెక్టుకు అరువుపై స్టీలు, సిమెంటు సరఫరా చేయటంపై కంపెనీల ప్రతినిధులు చేతెలెత్తేసారు. మంగళవారం ఢిల్లీలో పోలవరం పనుల పురోగతిపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆధ్వర్యంలో కంపెనీల ప్రతినిధులు, ప్రాజెక్టు ఉన్నతాధికారులు, ట్రాన్ స్ట్రాయ్ ప్రతినిధులు చర్చలు జరిపారు. ప్రాజెక్టు పురోగతిని వేగవంతం చేయాలని కేంద్రం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో స్టీలు, సిమెంటు పేమెంటు విషయంలో మూడు నెలల గడువును ఇప్పించాలని ట్రాన్ స్ట్రాయ్ కోరింది. అందుకు కంపెనీల ప్రతినిధులు సాధ్యం కాదని తేల్చేసారు.

ఎందుకంటే, ఇప్పటికే నెలరోజుల అరువుపై స్టీలు, సిమెంటును సరఫరా చేస్తున్నారట. ప్రాజెక్టును నిర్మిస్తున్న సంస్ధ ఆర్దిక పరిస్ధితిని దృష్టిలో పెట్టుకుని కంపెనీల ప్రతినిధులు తమ నిర్ణయాన్ని స్పష్టం చేసారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా రోజుకు 4 వేల టన్నుల సిమెంటు అవసరం అవుతోంది. అంత భారీ ఎత్తున సిమెంటు వాడుతున్నారు కాబట్టి కంపెనీలు ఇప్పటికే తక్కువ ధరకు సరఫరా చేస్తున్నాయి. అదే విషయాన్ని కంపెనీలు కేంద్రమంత్రితో స్పష్టం చేశాయి. నెల రోజుల అరువు అంటే ఇప్పటికే కష్టంగా ఉందని అటువంటిది ఏకంగా మూడు నెలలంటే సాధ్యం కాదని స్పష్టంగా చెప్పేసాయి.

అయితే, కొన్ని కంపెనీలు ఓ షరతుపై మూడు నెలల అరువుకు అంగీకరించాయి. అదేంటంటే, ఇపుడిస్తున్న బేసిక్ ధరకు సరఫరా సాధ్యం కాదని చెప్పాయి. బయటధరలకు ఇస్తున్నట్లుగానే పోలవరంకు కూడా సరఫరా చేస్తామని చెప్పాయి. అందుకు ట్రాన్ స్ట్రాయ్ సంస్ధ అంగీకరించలేదు. దాంతో మూడు నెలల అరువు అన్న ప్రతిపాదనను సిమెంటు, స్టీ కంపెనీలు తోసిపుచ్చాయి. దాంతో సమస్య మళ్ళీ మొదటికి వచ్చినట్లైంది. సరే, చివరలో గడ్కరీ మాట్లాడుతూ, ప్రత్యామ్నాయాలు ఆలోచిద్దామని, తనకు తెలిసిన ఇతర కంపెనీలతో కూడా మాట్లాడి చూద్దామని చెప్పి సమావేశం ముగించారు.  

click me!