జగన్ ఫ్యామిలీ మెంబర్ అరెస్ట్ కు సిబిఐ రంగం సిద్దం..: వర్ల రామయ్య సంచలనం

By Arun Kumar PFirst Published Jun 11, 2021, 4:54 PM IST
Highlights

ఇప్పుడున్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రికి ఢిల్లీ కేంద్రంగా చాలా గడ్డు సమస్యలు ఉన్నాయని... వాటిలో ప్రధానమైనది జగన్మోహన్  రెడ్డి బెయిల్ రద్దు వ్యవహారమని అన్నారు టిడిపి నాయకులు వర్ల రామయ్య, 

అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీయాత్ర స్వకార్యమో లేక స్వామికార్యమో ప్రజలకు తెలియాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శివర్ల రామయ్య అభిప్రాయపడ్డారు.  స్వామికార్యమంటే ప్రజలకోసం, రాష్ట్రాభివృద్ధికోసం, రాష్ట్ర ప్రజల సర్వతోముఖాభివృద్ధి కోసమని అర్థమని... అందుకోసమే ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లారా? అని ప్రశ్నించారు. స్వకార్యమంటే సొంతపనులని అర్థమని రామయ్య పేర్కొన్నారు. 

''ఇప్పుడున్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రికి ఢిల్లీ కేంద్రంగా చాలా గడ్డు సమస్యలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనది జగన్మోహన్  రెడ్డి బెయిల్ రద్దు వ్యవహారం. బెయిల్ రద్దయితే ఆయన తిరిగి జైలుకెళ్లాల్సి ఉంటుంది. అదే జగన్మోహన్ రెడ్డి ముందున్న అతిపెద్ద గడ్డుసమస్య. రెండోదేమిటంటే సీబీఐ వారు ఈరోజు పులివెందులలో ఉన్నారు. ఏక్షణంలోనైనా బాంబు పేల్చడానికి వారు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యమంత్రి కుటుంబంలోని పెద్దవ్యక్తిని అరెస్ట్ చేయడానికి సీబీఐ సిద్ధంగా ఉందని పబ్లిక్ అంతా అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆశ్చర్యచకితుడయ్యేలా సీబీఐ బాంబ్ పేల్చడానికి సిద్ధంగా ఉందంటున్నారు'' అని పేర్కొన్నారు. 

''ఇక ముఖ్యమంత్రికి ఉన్న మూడో గడ్డుసమస్య ఏమిటంటే ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం. రఘురామరాజు వ్యవహారం  ఈ ముఖ్యమంత్రికి పెద్ద గుదిబండలా తయారైంది. ఒక సిట్టింగ్ ఎంపీని ముఖ్యమంత్రి తగని కేసులో అరెస్ట్ చేసి, కస్టడీలో ఉండగా థర్డ్ డిగ్రీ ఉపయోగించారు. రఘురామరాజుపై వ్యవహరించిన తీరు దేశమంతా తెలిసిపోయింది. దాన్నుంచి ఎలా బయటపడాలన్నదే ఈ ముఖ్యమంత్రి ఆరాటం'' అన్నారు. 

read more  జైలుకు పంపిస్తారనే భయంతోనే...: జగన్ డిల్లీ పర్యటనపై యనమల సంచలనం

''ఈ  ప్రభుత్వ వ్యవహారశైలిని దేశమంతా తప్పుపడుతోంది. ప్రజలు అధికారమైతే ఇచ్చారు గానీ, ప్రభుత్వాన్నిఎలా నడపాలో జగన్మోహన్ రెడ్డికి తెలియడం లేదనే వాస్తవం దేశమంతా తెలిసిపోయింది. రఘురామ కృష్ణంరాజు ముఖ్యమంత్రికి కొరకరాని కొయ్యలా మారాడు. ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఢిల్లీయాత్ర స్వకార్యమా.. స్వామికార్యమా అనే సందేహం అందరిలోనూ ఉంది. ముఖ్యమంత్రి ఢిల్లీ యాత్రకు సంబంధించి, ఇక్కడున్నవారు విడుదలచేసిన పత్రికా ప్రకటనా అంతా అబద్ధాలపుట్టే. నిన్న ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. స్వకార్యం నిమిత్తమే ముఖ్యమంత్రి, హోంమంత్రి అమిత్ షాను కలిశారు'' అని పేర్కొన్నారు. 

''తనపై ఉన్న కేసులతో పాటు, బాబాయి హత్యకేసులో సీబీఐ చేస్తున్న విచారణకు సంబంధించి అరెస్ట్ లు జరక్కకుండా చూడటం కోసం, రఘురామ కృష్ణంరాజు వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి మిగిలిన భంగపాటును కప్పిపుచ్చుకోవడానికే జగన్మోహన్ రెడ్డి అమిత్ షాను కలిశారని నేనంటాను. అలాకాదని చెప్పగల ధైర్యం ముఖ్యమంత్రికి ఉందా? రాష్ట్రముఖ్యమంత్రికి కేంద్రహోం మంత్రితో ఏం పనుంటుంది? గంటా32నిమిషాలసేపు రహస్యంగా అమిత్ షాతో భేటీ కావాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి ఏముంది? ఏరాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లినా, కేంద్ర హోంమంత్రిని కలిసింది లేదు. ఏశాఖకు సంబంధించిన వ్యవహారాలకు ఆయా శాఖలకు మంత్రులున్నప్పుడు ముఖ్యమంత్రి గంట32నిమిషాలపాటు అమిత్ షాతో ఎందుకుభేటీ అయ్యారు. ఎందుకంటే సీబీఐ ఉండేది అమిత్ షా ఆధ్వర్యంలో కాబట్టి'' అని అన్నారు. 

''రాష్ట్రంలో శాంతిభద్రతలు కూడా కుంటిగుర్రంలా, గుడ్డి గుర్రంలా వాటిమానాన అవి నడుస్తున్నాయి. వాటిగురించి కేంద్ర హోంమంత్రితో చర్చించాల్సిన అత్యవసర పరిస్థితులేమీ రాష్ట్రంలో లేవు. అందుకే   ముఖ్యమంత్రి స్వకార్యం కోసమే గంట 32 నిమిషాలపాటు అమిత్ షాతో భేటీ అయ్యారని నేనంటున్నాను. కాదని చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డిపైనే ఉంది. 11సీబీఐ కేసుల్లో వేటిలోకూడా బెయిల్ రద్దుకాకుండా చూడాలని జగన్మోహన్ రెడ్డి, అమిత్ షాను వేడుకున్నారా? బాబాయ్ హత్యకేసులో ప్రధాననిందితుడైన, తనకు కావాల్సిన వ్యక్తి అరెస్ట్ కాకుండా చూడాలని కోరారా? తద్వారా తనపరువు, తనకుటుంబం పరువు, హోల్ సేల్ గా రాష్ట్రం పరువు పోకుండా చూడాలని జగన్మోహన్ రెడ్డి , అమిత్ షాని వేడుకున్నారా? లేకుంటే రఘురామకృష్ణంరాజు  తనకుకొరుకుడు పడటంలేదు కాబట్టి, అతని చర్యలతో తన పరువుపోకుండా చూడాలని జగన్మోహన్ రెడ్డి , అమిత్ షాను ప్రాధేయపడ్డారా?'' అంటూ వర్ల నిలదీశారు. 

 
 

click me!