వైఎస్ వివేకా హత్య కేసు: సిబిఐ విచారణకు శంకర రెడ్డి, అవినాష్ రెడ్డి అనుచరుడు

By telugu news teamFirst Published Jul 29, 2020, 10:16 AM IST
Highlights

నేడో రేపో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు వైఎస్  కుటుంబసభ్యులను కొందరిని విచారించనున్నట్లు సమాచారం. 

వైసీపీ నేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాబాయి వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు కొనసాగుతోంది. సరిగ్గా ఎన్నికలకు కొద్దిరోజుల ముందు వివేకా తన ఇంట్లోనే దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. కాగా.. ఈ కేసు కు సంబంధించి పోలీసులు పలువురు అనుమానితులను విచారిస్తున్నారు.

కాగా.. కడప నగరంలోని సెంట్రల్ జైలు ఆవరణలో ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు చెప్పారు. కడప కేంద్రంగా ప్రముఖులను సీబీఐ బృందం విచారిస్తోంది. నేడు పులివెందుల వైసీపీ నేత దేవిరెడ్డి శంకర్‌రెడ్డిని విచారిస్తోంది. ఆయన సిబిఐ విచారణకు హాజరయ్యారు. శంకరరెడ్డి అవినాష్ రెడ్డి అనుచరుడు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి సన్నిహితుడు కూడా. వైఎస్ వివేకా హత్య తర్వాత మొదట వెళ్లినవారిలో శంకర రెడ్డి ఒకరు.

నేడో రేపో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు వైఎస్  కుటుంబసభ్యులను కొందరిని విచారించనున్నట్లు సమాచారం. వైఎస్ కుటుంబసభ్యుల విచారణ అనంతరం టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డిలను సీబీఐ బృందం విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

కాగా.. ఇప్పటికే..సీబీఐ విచారణకు వివేకా కుమార్తె సునీత హాజర‌య్యారు. సెంట్రల్ జైల్లో ఉన్న గెస్ట్ హౌస్ లో ప్రత్యేక విచారణ అధికారి నేతృత్వంలో సునీతను 7 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు సీబీఐ అధికారులు. హత్య జరిగిన రోజు నుంచి ఇప్పటివరకు జరిగిన అన్ని పరిస్థితులపై సునీతను ద‌గ్గ‌ర్నుంచి వివ‌రాలు సేక‌రించారు. ఆమె స్టేట్మెంట్ ను రికార్డు చేశారు. ఇవాళ కూడా మరికొందరిని విచారించే అవకాశం ఉంది.

కాగా గ‌త‌ ఆదివారం సిట్ దర్యాప్తు నివేదికను పులివెందుల పోలీసులు సీబీఐకి అప్పగించారు. 3 బ్యాగుల్లో ఉన్న నివేదికలను స్వాధీనం చేసుకున్న సీబీఐ ఆఫిస‌ర్స్..కీల‌క అనుమానితుల‌పై ఫోక‌స్ పెట్టారు. ఇప్పటికే 15 మంది అనుమానితుల లిస్ట్ రెడీ చేసినట్లు సమాచారం. ఆ జాబితాలో వైఎస్​ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, బాబాయ్ మనోహర్ రెడ్డితో పాటు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, బీజేపీ నేత‌ ఆదినారాయణరెడ్డి పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది.
 

click me!