నెల్లూరు జిల్లా కెమికల్ పరిశ్రమలో భారీ ప్రమాదం, నలుగురికి తీవ్ర గాయాలు

By Sreeharsha GopaganiFirst Published Jul 29, 2020, 7:26 AM IST
Highlights

నెల్లూరు లోని ఒక కెమికల్ పరిశ్రమలో బాయిలర్ పేలింది. ఈ ఘటనలో నలుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని రజినీకాంత్, హఫీజ్, రవి, భాస్కర్ లుగా గుర్తించారు. నెల్లూరు లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుస పారిశ్రామిక ప్రమాదాలు భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. విశాఖ ఎల్జీ కంపెనీలో స్టైరిన్ గ్యాస్ లీక్ ఘటన ఉదంతాన్ని మరువక ముందే కర్నూల్ లో లీక్, ఆ తరువాత విశాఖలోనే మరోసారి గ్యాస్ లీక్ అయింది. ఇప్పుడు తాజగా నెల్లూరు లోని ఒక కెమికల్ పరిశ్రమలో బాయిలర్ పేలింది. 

నెల్లూరు జిల్లా వింజమూరు మండలం లోని వెంకటనారాయణ ఆక్టివ్ ఇంగ్రిడియెంట్స్ కెమికల్ ఫ్యాక్టరీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని రజినీకాంత్, హఫీజ్, రవి, భాస్కర్ లుగా గుర్తించారు. నెల్లూరు లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఈ సంఘటన చివుతూ చేసుకున్నట్టుగా తెలియవస్తుంది. ఈ ఘటన విషయాన్నీ తెలుసుకున్న స్థానిక ఎమ్మార్వో, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని అక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. 

తరుచుగా ప్రమాదాలు జరుగవుతున్నప్పటికీ... సరైన ప్రమాణాలను పరిశ్రమ యాజమాన్యం పాటించలేదు. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఈ ఘటనతో తీవ్ర భయాందోళనలకు లోనవుతున్నారు. పరిశ్రమల పక్కన నివసించాలంటేనే భయమవుతుందని స్థానికులు అంటున్నారు. 

గాయపడ్డ కార్మికుల కుటుంబ సభ్యులు సైతం, ఫ్యాక్టరీలో భద్రత చర్యలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కంపెనీలో పలుమార్లు ప్రమాదాలు జరుగుతున్న విషయాన్నీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ...ఎటువంటి ప్రయోజనం లేదని స్థానికులు అంటున్నారు. 

ఫ్యాక్టరీ నుంచి విడుదలయ్యే వ్యర్థాల వల్ల ఊరులోని నీటి వనరులన్నీ కలుషితమవుతున్నాయని, ఆ కంపెనీ నుంచి వచ్చే గ్యాస్ వల్ల ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా మారుతుందని స్థానికులు గతంలో కొన్ని నెలలపాటు ఈ కంపెనీ ముందు ఆందోళనలు సైతం నిర్వహించారు. 

పంట పొలాలు బీడు భూములుగా మారుతున్నాయని, తమ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిని అనారోగ్యంబారిన పడుతున్నామని అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పెద్ద ప్రయోజనం మాత్రం లేదని అంటున్నారు స్థానికులు. 

దాదాపుగా 50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కంపెనీలో గతంలో మరణాలు సంభవించినప్పటికీ... మూడవ కంటికి తెలియకుండా, వారి రాజకీయ పలుకుబడిని ఉపయోగించి బయటకు పొక్కనీయకుండా చూసేవారని, ఇప్పుడు కూడా వారు గాయాలపాలవ్వడం వల్ల మాత్రమే ఈ ఘటన వెలుగు చూసిందని స్థానికులు అంటున్నారు. 

click me!