వైఎస్ వివేకా హత్య కేసు: జగన్ కు ముందే తెలుసన్న సీబీఐ

By Siva KodatiFirst Published Jun 8, 2023, 9:09 PM IST
Highlights

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ సంచలన వ్యాఖ్యలు చేసింది. వివేకా హత్య గురించి ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు ముందే తెలుసునని పేర్కొంది. అవినాష్‌ను ఏ8గా చేర్చిన సీబీఐ.. వివేకా హత్యకు కుట్ర, సాక్ష్యాలను చెరిపివేయడంలో భాస్కర్ రెడ్డి, అవినాష్ ప్రమేయం వుందని ఆరోపించింది.

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు విచారణను జూన్ 30లోగా పూర్తి చేయాలని సుప్రీంకోర్ట్ ఆదేశాల నేపథ్యంలో సీబీఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. దీనిలో భాగంగా గురువారం కీలక పరిణామం చోటు చేసుకుంది. వివేకా హత్య గురించి ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు ముందే తెలుసునని సీబీఐ సంచలన ప్రకటన చేసింది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సీబీఐ దాఖలు చేసిన కౌంటర్‌లో కీలక విషయాలను ప్రస్తావించింది. 

వివేకా హత్య విషయం ఘటన జరిగిన రోజు ఉదయం 6.15కి ముందే తెలుసునని సీబీఐ వెల్లడించింది. వివేకా పీఏ ఈ విషయాన్ని బయటకు చెప్పకముందే అప్పటి ప్రతిపక్షనేతకు తెలుసునని దర్యాప్తులో గుర్తించామని పేర్కొంది. శివశంకర్ రెడ్డి ఫోన్ చేసిన వెంటనే నిమిషాల వ్యవధిలోనే వివేకా ఇంటికి అవినాష్ రెడ్డి చేరుకున్నారని సీబీఐ చెప్పింది. ఉదయం 5.20కి ముందే అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డితో గంగిరెడ్డి మాట్లాడినట్లు దస్తగిరి గతంలో వాంగ్మూలం ఇచ్చారని.. అలాగే స్థానిక సీఐ శంకరయ్యతో కేసు పెట్టొద్దని, పోస్ట్‌మార్టం వద్దని అవినాష్ , శివశంకర్‌లు చెప్పారని సీబీఐ పేర్కొంది. 

ALso Read: వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. వైఎస్ అవినాష్ రెడ్డిని నిందితుడిగా పేర్కొన్న సీబీఐ..

అవినాష్‌ను ఏ8గా చేర్చిన సీబీఐ.. వివేకా హత్యకు కుట్ర, సాక్ష్యాలను చెరిపివేయడంలో భాస్కర్ రెడ్డి, అవినాష్ ప్రమేయం వుందని ఆరోపించింది. దీనికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద వున్నాయని పేర్కొంది. సాక్షులను ప్రభావితం చేసేందుకు , కేసును పక్కదారి పట్టించే విధంగా తండ్రీకొడుకులిద్దరూ ప్రయత్నించారని వెల్లడించింది. భాస్కర్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లోనూ బెయిల్ మంజూరు చేయొద్దని.. కడప, పులివెందుల ప్రాంతాల్లో భాస్కర్ రెడ్డి శక్తివంతమైన నేతని సీబీఐ పేర్కొంది. ఈయన అరెస్ట్ సమయంలో చోటు చేసుకున్న ధర్నాలు, ఆందోళనలే భాస్కర్ రెడ్డి సత్తాకి  నిదర్శనమని.. అలాంటి వ్యక్తి బయట వుంటే కేసుకు నష్టం కలుగుతుందని సీబీఐ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. 

భాస్కర్ రెడ్డిపై గతంలోనే 3 కేసులు వున్నాయని.. వీటిలో రెండు వీగిపోగా, మరొకటి తప్పుడు కేసుగా కొటటేశారని సీబీఐ పేర్కొంది. రోజుల తరబడి జైల్లో వుండటాన్ని ఆధారంగా చేసుకుని బెయిల్ ఇవ్వొద్దని సూచించింది. అలాగే దస్తగిరి విషయంలో దర్యాప్తు నిష్పక్షపాతంగా జరిగిందని.. అతనికి కడప కోర్ట్ బెయిల్ మంజూరు చేసిందన్నారు. మరోవైపు.. వైఎస్ భాస్కర్ రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దని వివేకా కుమార్తె సునీతా రెడ్డి కోర్టును కోరారు. ఈ మేరకు ఆమె న్యాయస్థానానికి లిఖిత పూర్వకంగా వాదనలు సమర్పించారు. భాస్కర్ రెడ్డికి బెయిల్ ఇస్తే సాక్షులను, దర్యాప్తును ప్రభావితం చేస్తారని సునీత ఆరోపించారు. 
 

click me!