మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ల మధ్య రాజకీయ వైరం కోర్టులకు చేరిన విషయం తెలిసిందే. తాజాగా సిబిఐ కాకానికి నెల్లూరు కోర్టులో చోరీతో సంబంధం లేదని తేల్చింది.
అమరావతి : ఎన్నికల వేళ ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ కు ఊరట లభించింది. నెల్లూరు జిల్లా కోర్టులో దొంగతనం కాకాని చేయించిన పనేనని టిడిపి ఆరోపిస్తోంది... దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ విచారణ జరుపుతోంది. ఈ క్రమంలోనే ఈ కోర్టు చోరీతో మంత్రి కాకానికి ఎలాంటి సంబంధం లేదని... ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసిన నిందితులే దోషులని సిబిఐ తేల్చింది. ఈ మేరకు కేసు విచారణ చేపడుతున్న విజయవాడ కోర్టులో సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.
నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థులు. దీంతో ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకోవడం సహజమే. ఇలా టిడిపి అధికారంలో వుండగా సోమిరెడ్డి భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపించిన కాకాని కొన్ని ఆదారాలను కూడా బయటపెట్టారు. మలేషియా, సింగపూర్, హాంకాంగ్ తో పాటు మరికొన్ని దేశాల్లో సోమిరెడ్డికి ఆస్తులు, అకౌంట్లు వున్నాయంటూ కొన్ని పత్రాలను కాకాని విడుదల చేసారు. ఈ పత్రాలు ఫోర్జరీ చేసినవిగా పేర్కొంటూ సోమిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈ విషయమై ఏపీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అయితే సోమిరెడ్డి అక్రమ ఆస్తులంటూ కాకాని విడుదలచేసిన పత్రాలను నెల్లూరు జిల్లా కోర్టులో భద్రపర్చారు. కానీ కోర్టులో చోరీ జరిగి ఈ పత్రాలు మాయం కావడం రాజకీయ వివాదానికి దారితీసింది. అధికార అండతో కాకాని గోవర్ధన్ కోర్టులో చోరీ చేయించి ఆదారాలను మాయం చేసాడని సోమిరెడ్డి ఆరోపిస్తున్నారు. కోర్టులో చోరీ ఘటనను సీరియస్ గా తీసుకున్న సిబిఐ విచారణకు ఆదేశించింది. దీంతో ఇప్పటివరకు సిబిఐ సోమిరెడ్డితో పాటు 88 మందిని విచారించింది.
Also Read అందుకే జనసేనలో చేరుతున్నా.. వైసీపికి షాకిచ్చిన మచిలిపట్నం ఎంపీ..
తాజాగా నెల్లూరు కోర్టు చోరీ వ్యవహారంపై విచారణ పూర్తిచేసిన సిబిఐ ఇందులో మంత్రి కాకాని గోవర్ధన్ ప్రమేయం లేదని తేల్చింది. స్థానిక పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసినవారే దోషులుగా తేల్చింది. ఈ దొంగలు కూడా నెల్లూరు కోర్టులో పత్రాలను చోరీ చేయడానికి రాలేదని... ఇనుప వస్తువుల చోరీకి వచ్చారన్న పోలీసుల వాదన నిజమేనని సిబిఐ నిర్దారించింది. కేవలం కుక్కలు వెంటపడటంతోనే కోర్టు ప్రాంగణంలోకి ప్రవేశించినట్లు పోలీసులు చెబుతున్నదే నిజం అనేలా సిబిఐ దాఖలుచేసిన చార్జ్ షీట్ వుంది.