
నరసాపురం వైసీపీ ఎంపీ, ఇండ్–భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ డైరెక్టర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు, ఆయన భార్య రమాదేవి, కుమార్తె కె.ఇందిరా ప్రియదర్శినిపై బ్యాంకులను మోసం చేశారంటూ వచ్చిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేసుకోవచ్చునని హైకోర్టు స్పష్టం చేసింది.
రుణాలు చెల్లించని కంపెనీల బ్యాంకు ఖాతాలను మోసపూరితంగా ప్రకటించాలన్న ఆర్‌బీఐ సర్క్యులర్ నేపథ్యంలో తమ కంపెనీల ఖాతాలను మోసపూరితంగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ ఇండ్–భారత్‌తోపాటు, రాజు, ఆయన భార్య, కుమార్తె దాఖలు చేసుకున్న పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం శుక్రవారం విచారించింది.
ఎంపీకి చెందిన కంపెనీలకు నోటీసులు ఇవ్వకుండా, కనీసం వారి వివరణ కూడా తీసుకోకుండా ఇలా మోసపూరిత ఖాతాలుగా ప్రకటించిన నేపథ్యంలో.... ఆ ఉత్తర్వులను నిలిపివేస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను కోర్టు పొడిగించింది.
ఈ ఉత్తర్వులు సీబీఐ దర్యాప్తునకు అడ్డుకాబోవని, సిబిఐ ఈ ఆరోపణల మీద విచారణ జరుపుకోవచ్చని స్పష్టం చేసింది. రుణంగా తీసుకున్న రూ.30.94 కోట్లు చెల్లించకపోవడంతో కొన్ని బ్యాంకులు ఇండ్–భారత్ కంపెనీ బ్యాంకు ఖాతాలను గతంలో మోసపూరితంగా ప్రకటించాయి. వాదనల తరువాత, తదుపరి విచారణను జూలై 16 కి కోర్టు వాయిదా వేసింది.