ఆంధ్రప్రదేశ్ లో రెండవ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు జరుగనుంది. పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది.
ఆంధ్రప్రదేశ్ లో రెండవ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ నేడు శనివారం ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైంది. ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. పోలింగ్ లో ఎటువంటి సమస్యలు లేవని, అంతా ప్రశాంతంగా సాగుతుందని ఇప్పటికే కృష్ణా, చిత్తూరు ఎస్పీలు స్పష్టం చేసారు.
సమస్యాత్మక పోలింగ్ స్థానాలను గుర్తించి ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేసారు. చాలామందిని ఇప్పటికే తీసుకున్నారు. కొందరిపై బైండ్ ఓవర్ కేసులు కూడా నమోదు చేసినట్టుగా పోలీసువారు తెలిపారు.
undefined
రెండో దశలో 13 జిల్లాల్లో, 18 రెవెన్యూ డివిజన్లలోని 167 మండలాల్లో 3,328 సర్పంచ్ స్థానాలకు, 33,570 వార్డు సభ్యులకు గాను నోటిఫికేషన్ జారీచేయగా... 539 సర్పంచ్‌లు, 12604 వార్డు సభ్యుల స్థానాల్లో ఏకగ్రీవాలు అయిన విషయం తెలిసిందే.
నెల్లూరు, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కో సర్పంచ్ స్థానం చొప్పున మొత్తం మూడు చోట్ల సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. అంతేకాకుండా 149 చోట్ల వార్డు సభ్యులకు ఒక్క నామినేషన్ కూడా అందకపోవడం గమనార్హం. దీంతో ఏకగ్రీవాలు పోను 2,786 సర్పంచ్‌లకు, 20,817 వార్డు సభ్యులకు ఎన్నికలు జరగనున్నాయి.
సర్పంచ్ స్థానాల బరిలో 7,507 మంది అభ్యర్థులు పోటీపడుతుండగా... వార్డు స్థానాలకు 44,876 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 29,304 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల కమీషన్ ఏర్పాటు చేసింది.
ఈ పోలింగ్ కేంద్రాల్లో 5,480 కేంద్రాలను సమస్యాత్మకంగా, 4,181 కేంద్రాలను అత్యంత సమస్యాత్మకంగా గుర్తించారు. 18,387 పెద్దవి, 8,351 మధ్యరకం, 24,034 చిన్న బ్యాలెట్ బాక్సులను ఎన్నికల కోసం ఎన్నికల సంఘం సిద్ధంచేసింది. 3.30 కు పోలింగ్ ముగిసిన తరువాత సాయంత్రం నాలుగు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. నేటి రాత్రికల్లా అన్ని స్థానాల ఫలితాలు వెలువడనున్నాయి.