వైఎస్ వివేకా హత్య కేసులో మరొకరి అరెస్టు: ముందు కుక్కను చంపేసి....

By telugu teamFirst Published Sep 10, 2021, 7:15 AM IST
Highlights

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ మరొకరిని అరెస్టు చేసింది. ఇంతకు ముందు సునీల్ యాదవ్ ను అరెస్టు చేసిన సిబిఐ తాజాగా ఉమాశంకర్ రెడ్డిని అరెస్టు చేసింది.

కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ అధికారులు మరొకరని అరెస్టు చేశారు. ఇంతకు ముందు సునీల్ యాదవ్ ను సిబిఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా గురువారంనాడు కడప జిల్లా సింహాద్రిపురం మండలం కుంచేకులకు చెందిన ఉమాశంకర్ రెడ్డిని ఉదయం నుంచి సిబిఐ అధికారులు విచారించారు. ఆ తర్వాత సాయంత్రం అరెస్టు  చేసి పులివెందుల కోర్టులో హాజరుపరిచారు. 

ఉమాశంకర్ రెడ్డిని ఐదు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సిబిఐ పులివెందుల కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వైఎస్ వివేకానంద రెడ్డి పొలం పనులు చేసే జగదీశ్వర్ రెడ్డి సోదరుడు ఉమా శంకర్ రెడ్డి. కోర్టు ఉమాశంకర్ రెడ్డికి ఈ నెల 23వ తేదీ వరకు రిమాండ్ విధించింది. దీంతో అతన్ని సిబిఐ అధికారులు పులివెందుల నుంచి కడప జైలుకు తరలించారు. 

వైఎస్ వివేకా హత్య కేసులో సునీల్ యాదవ్, ఉమా శంకర్ పాత్రపై ఆధారాలున్నాయని, హత్య కేసులో ఇద్దరు కుట్రలో పాల్గొన్నారని, ఉమాశంకర్ పాత్రపై సునీల్ విచారణలో చెప్పారని సిబిఐ రిమాండ్ రిపోర్టులో తెలిపింది. వివేకా హత్యకు ముందు ఆయన నివాసంలోని కుక్కను చంపేశారని సిబిఐ చెప్పింది. సునీల్, ఉమాశంకర్ కలిసి కారుతో ఢీకొట్టి  కుక్కను చంపారని చెప్పింది. 

హత్య చేయడానికి ఉమా శంకర్, సునీల్ బైక్ మీద వెళ్లారని, ఉమాశంకర్ బైక్ లో గొడ్డలి పెట్టుకుని పారిపోయాడని సిబిఐ తెలిపింది. బైక్ ను, గొడ్డలిని స్వాధీనం చేసుకున్నట్లు సిబిఐ తన రిమాండ్ రిపోర్టులో తెలిపింది. గత నెల 11వ తేదీన ఉమాశంకర్ ఇంట్లో రెండు చొక్కాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. మరింత మంది నిందితులను పట్టుకోవాల్సి ఉందని, ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకోవాల్సి ఉందని సిబిఐ తెలిపింది. గుజరాత్ నుంచి ఫోరెన్సిక్ నివేదిక తెప్పించినట్లు తెలిపింది. 

click me!