
న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థపై సోషల్ మీడియాలో కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ దాఖలైన కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు దర్యాప్తు మరింత వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేసిన సీబీఐ.. తాజాగా మరో ముగ్గురిని అరెస్ట్ చేసింది. సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన వారిలో మెట్ట చంద్రశేఖర్, గోపాలకృష్ణ కళానిధి, గుంట రమేష్ కుమార్‌లు ఉన్నారు. వీరిలో చంద్రశేఖర్, గోపాలకృష్ణ ఇద్దరు లాయర్లు. గుంట రమేష్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి చంద్రశేఖర్.. ఏ18గా, గోపాలకృష్ణ.. ఏ19గా, రమేశ్‌కుమార్.. ఏ 20గా ఉన్నారు. ఈ క్రమంలోనే వీరికి ఈ నెల 10వ తేదీన సీబీఐ అధికారులు సీఆర్‌పీసీ సెక్షన్ 41 A కింద నోటీసులు ఇచ్చారు.
దీంతో వీరు శనివారం హైదరాబాద్‌లో కోఠిలోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. అయితే వీరిని విచారించిన సీబీఐ అధికారులు.. విచారణకు సహకరించట్లేదని పేర్కొంటూ అరెస్ట్ చేశారు. అనంతరం ముగ్గురు నిందితులను హైదరాబాద్ నుంచి గుంటూరుకు సీబీఐ అధికారులు తరలించారు. గుంటూరులో సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు అధికారులు నిందితులు ముగ్గురిని హాజరుపరిచారు. దీంతో ఈ ముగ్గురికి సీబీఐ కోర్టు రిమాండ్ విధించింది. చంద్రశేఖర్, గోపాలకృష్ణ, రమేష్‌లకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ సీబీఐ కోర్టు నిర్ణయం తీసుకుంది.
ఇక, న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పులపై కొందరు సామాజిక మాధ్యమాల్లో కించపరిచేలా పోస్టులు పెట్టారని 2020 మే 26న ఏపీ హైకోర్టు కోర్టుధిక్కరణ కింద సుమోటోగా విచారణ చేపట్టింది. ఈ కేసు విచారణ సందర్భంగా మెట్ట చంద్రశేఖర్, గోపాలకృష్ణ కళానిధి హైకోర్టుకు బేషరతుగా క్షమాపణలు చెబుతూ అఫిడవిట్లు దాఖలు చేశారు. భవిష్యత్తులో అభ్యంతరకర వ్యాఖ్యలు చేయబోమని అందులో పేర్కొన్నారు. దీంతో గోపాలకృష్ణ, చంద్రశేఖర్‌లపై ఉన్న కోర్టుధిక్కరణ కేసును న్యాయస్థానం మూసేసింది.