ఏబీ వెంకటేశ్వర రావుకు క్యాట్ లో చుక్కెదురు: పిటిషన్ తోసివేత

By telugu teamFirst Published Mar 17, 2020, 11:19 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగం మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వర రావుకు క్యాట్ లో చుక్కెదురైంది. వైఎస్ జగన్ ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను కొట్టేయడానికి క్యాట్ నిరాకరించింది.

అమరావతి: తన సస్పెన్షన్ ను సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగం మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వర రావు పిటిషన్ ను క్యాట్ తోసిపుచ్చింది. ఏబీ వెంకటేశ్వర రావు సస్పెన్షన్ ను రద్దు చేసేందుకు నిరాకరించింది. భద్రతా పరికరాల కొనుగోలు వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. 

తనపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ఏబీ వెంకటేశ్వర రావు కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించవచ్చునని తెలిపింది. రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే తనను సస్పెండ్ చేశారని, అది చట్టవిరుద్ధమని ఆయన క్యాట్ లో దాఖలు చేసిన పిటిషన్ లో చెప్పారు. 

also Read: ఏబీ వెంకటేశ్వరరావుకు కేంద్రం షాక్: జగన్ సర్కార్ కు బాసట

నిరుడు మే 31వ తేదీ నుంచి తనకు వేతనం కూడా చెల్లించడం లేదని ఆయన తెలిపారు. సస్పెన్షన్ ఉత్తర్వులను కొట్టేయాలని ఆయన క్యాట్ ను కోరారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వ హయాంలో ఆయన ఇంటలిజెన్స్ చీఫ్ గా పనిచేశారు. 

ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ జగన్ ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వర రావును సస్పెండ్ చేసింది. అదనపు పోలీసు డైరెక్టర్ జరనల్ గా ఉన్నప్పుడు వెంకటేశ్వర రావు భద్రత పరికరాల కొనుగోలు టెండర్లలో అక్రమాలకు పాల్పడ్డారని తేలిందని చెబుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. 

Also Read: నిజమా?: బాబుతో కలిసి కుట్ర, కుమారుడికి ఏబీ వెంకటేశ్వర రావు కాంట్రాక్ట్

ఏబీ వెంకటేశ్వర రావు పోలీసు ఇంటలిజెన్స్ ప్రొటోకాల్స్ నిబంధనలను ఉద్దేశ్యపూర్వకంగా ఉల్లంఘించారని ఆరోపించింది. దేశ భద్రతకు సంబంధించిన కీలకలమైన విషయాలను బహిర్గతం చేసినట్లుగా కూడా ఆరోపించింది. 

click me!