ఎంపీ రఘురామపై కులసంఘాల ఫైర్: ఫ్లెక్సీకి గాజులు, దిష్టిబొమ్మ దహనం

By Sreeharsha GopaganiFirst Published Jun 18, 2020, 8:17 AM IST
Highlights

తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలోని వివిధ కుల సంఘాలు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. తమ కులాలను అవమానించారంటూ ఎంపీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఆయన దిష్టి బొమ్మను దహనం చేయడమే కాకుండా.... మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజుకు క్షమాపణ చెప్పాలని, చెప్పకపోతే నియోజకవర్గంలో తిరగనివ్వబోమని వారు హెచ్చరించారు.

ఆంధ్రప్రదేశ్ లో రఘురామకృష్ణం రాజు వ్యవహారం రోజురోజుకి మరింతగా రంజుగా మారుతుంది. ఆయనపై వైసీపీ నేతలు దాడి చేయడం, ఆయన కౌంటర్ ఇవ్వడం, మరల ఆయన వ్యాఖ్యలకు వారు కౌంటర్లు ఇవ్వడం టీవీ చర్చ కార్యక్రమాలు చూస్తున్న వారికి మంచి వినోదం దొరుకుతుంది. నన్నొక్కటంటే , నేను రెండు అంటాను అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు రఘురామకృష్ణంరాజు. 

ఇక తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలోని వివిధ కుల సంఘాలు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. తమ కులాలను అవమానించారంటూ ఎంపీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఆయన దిష్టి బొమ్మను దహనం చేయడమే కాకుండా.... మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజుకు క్షమాపణ చెప్పాలని, చెప్పకపోతే నియోజకవర్గంలో తిరగనివ్వబోమని వారు హెచ్చరించారు.

ఆకివీడులో ఎంపీ రఘురామకృష్ణంరాజు ఫ్లెక్సీపైపసుపు నీళ్లు చల్లి, గాజులు తొడిగి, కోడిగుడ్లు, టమాటాలతో కొట్టి నిరసన తెలిపారు. తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావుపై చేసిన అవినీతి ఆరోపణలు తక్షణం ఉపసంహరించుకోవాలని యాదవ సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. 

ఇకపోతే... తనను కాళ్లావేళ్లా బ్రతిమిలాడితే తాను వైసీపీలో చేరానని, తాను కాబట్టే నరసాపురం సెగ్మెంట్ లో వైసీపీ విజయదుందుభి మోగించిందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తనపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే ప్రసాదరాజుకు కౌంటర్ ఇస్తూ ఈ వ్యాఖ్యలు చేసారు ఫైర్ బ్రాండ్ ఎంపీ. 

గతంలో ఎన్నికలకు ముందు తనను వైసీపీలో చేరాలని కోరినా కూడ తాను చేరడానికి ఇష్టపడలేదన్నారు. రాష్ట్రం మొత్తం వైసీపీ విజయదుందుభి మోగించినా కూడ నరసాపురం ఎంపీ సెగ్మెంట్‌లో తమకు ఇబ్బంది ఉంటుందని ఆ పార్టీ నాయకత్వం తనకు చెప్పిందన్నారు. తాను వైసీపీలో చేరితే నరసాపురం ఎంపీ సెగ్మెంట్ లో మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని తనకు చెప్పి బతిమిలాడితే తాను వైసీపీలో చేరినట్టుగా ఆయన గుర్తు చేసారు. 

నరసాపురం ఎంపీ స్థానంలో తాను కాబట్టే విజయం సాధించినట్టుగా ఆయన బల్లగుద్దిచెబుతున్నట్టుగా ఆయన స్పష్టం చేశారు. జగన్ బొమ్మ చూసి ఓటేస్తేనే తన నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు విజయం సాధించలేదన్నారు. తన ముఖం చూసి కూడ జనం ఓట్లేస్తే ఈ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు తాను విజయం సాధించినట్టుగా ఆయన కుండబద్దలుకొట్టారు. 

click me!