‘దేశం’లో ఓటుకునోటు ప్రకంపనలు

First Published Mar 9, 2017, 7:45 AM IST
Highlights

వరుసగా చంద్రబాబుకు ఎదురుదెబ్బలు తగులుతుండటంతో టిడిపిలోను, నారా కుటుంబంలోనూ ప్రకంపనలు మొదలయ్యాయి.

ఓటుకునోటు కేసు చంద్రబాబునాయుడు మెడకు బాగానే చుట్టుకుంటోంది. ఇంతకాలం తాను నిప్పు అంటూ తనకు తాను సర్టిపికేట్ ఇచ్చుకుంటున్నట్లు భవిష్యత్తులో కుదరరదు. ఎందుకంటే, ఇదే కేసులో తాజాగా దాఖలు చేసిన అదనపు ఛార్జ్ షీట్ లో చంద్రబాబు పాత్రను, కుట్రను మొత్తం ఏసిబి వివరించింది. ఛార్జ్ షీట్ లో 22 చోట్ల చంద్రబాబు ప్రస్తావనను ఏసిబి ప్రస్తావించటం గమనార్హం. చంద్రబాబు వేసిన ప్లాన్ అమలయ్యుంటే కెసిఆర్ ప్రభుత్వం కూలిపోయి ఇప్పటికి ఏడాది దాటుండేదేమో. కానీ చివరినిముషంలో ప్లాన్ మొత్తం భగ్నమవ్వటంతో ఓటుకునోటు కేసు దేశవ్యాప్తంగా సంచలనమైంది.

 

విచిత్రమేమిటంటే, అప్పట్లో చంద్రబాబుకు సహకరించిన టిటిడిపి అధ్యక్షుడు ఎర్రబెల్లి దయాకర్ రావు ఇపుడు టిఆర్ఎస్ లోనే ఉండటం. ఓ ప్రముఖ హోటల్లో ఎంఎల్ఏల క్యాంపు రాజకీయాల కోసం తొమ్మిది గదులను ఎర్రబెల్లే బుక్ చేసినట్లు ఏసిబి స్పష్టంగా పేర్కొంది. అప్పట్లో జరిగిన మహానాడు సందర్భంగానే మొత్తం కుట్రకు ప్లాన్ జరిగిందని కూడా ఏసిబి పేర్కొన్నది. చంద్రబాబు ఇంట్లోనే కమిటిని ఏర్పాటు చేసి భారీ స్కెచ్ వేసినట్లు కూడా వెల్లడైంది.

 

ప్రస్తుతం ఏసిబి దాఖలు చేసిన అదనపు ఛార్జ్ షీట్ తో టిడిపిలో కలకలం మొదలైంది. దానికి తోడు మొన్ననే సుప్రింకోర్టు కూడా ఇదే కేసులో చంద్రబాబును విచారించేందుకు నోటీసులు కూడా జారీ చేసింది. వరుసగా చంద్రబాబుకు ఎదురుదెబ్బలు తగులుతుండటంతో టిడిపిలోను, నారా కుటుంబంలోనూ ప్రకంపనలు మొదలయ్యాయి. ఇంతకాలం స్టేలు తెచ్చుకోవటం ద్వారా విచారణను అడ్డుకుంటూ కాలం నెట్టుకొస్తున్న చంద్రబాబు ప్రస్తుతం ఏం చేస్తారో చూడాలి.

click me!