ప్రజాప్రతినిధుల కేసుల ఉపసంహరణపై ఏపీ హైకోర్టు సీరియస్

By Arun Kumar PFirst Published Jun 22, 2022, 2:52 PM IST
Highlights

ప్రజాప్రతినిధులపై వున్న కేసులను ఉపసంహరించుకోవడంపై ఏపీ హైకోర్టు సీరియస్ అయ్యింది. తమ అనుమతులు లేకుండా ఎలా కేసులను ఉపసంహరించుకుంటారని హైకోర్టు ప్రశ్నించింది. 

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజాప్రతినిధుల కేసుల ఉపసంహరణపై రాష్ట్ర హైకోర్టు సీరియస్ అయ్యింది. జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానుపై కేసులు ఉపసంహరించుకోవడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ఏపీజేఎఫ్ అధ్యక్షుడు చెవులు కృష్ణాంజనేయులు హైకోర్టులో పిటిషన్ వేసారు. ఈ పిటిషన్ పై ఇవాళ న్యాయస్థానంలో విచారణ జరగ్గా న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు.

పబ్లిక్ ప్రాసిక్యూటర్ తో అసలేమీ సంబంధమే లేకుండా కేవలం డీజీపీ, కలెక్టర్ ఆదేశాలతో కేసులు ఎలా తొలగిస్తారని న్యాయవాది ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కేసులు తొలగించాలంటే హైకోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని... కానీ ఉదయభాను కేసుల ఉపసంహరణ విషయంలో ఎలాంటి అనుమతులు తీసుకోలేదని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 

ఇదే విషయంపై ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టును హైకోర్టు కూడా ప్రశ్నించింది. హైకోర్టు అనుమతి లేకుండా కేసులు ఎలా తొలగించారని ధర్మాసనం ప్రశ్నించింది. ఇది కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని ధర్మాసనం పేర్కొంది. ఇప్పటివరకు ఎన్ని కేసుల తొలగింపునకు హైకోర్టు అనుమతి తీసుకున్నారు... ఎన్ని ఉపసంహరించారన్నదానిపై అఫిడవిట్ వేయాలని ధర్మాసనం ఆదేశించింది.    

ఓటర్లకు డబ్బుల పంపిణీ, అధికారులపై దాడుల కేసులు కూడా తొలగించారని పిటిషనర్ తరపు న్యాయవాది శ్రవణ్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం అఫిడవిట్ వేయకుంటే తామే ఈ కేసులో ఆదేశాలు ఇస్తామని ధర్మాసనం స్పష్టంచేసింది. 

జగ్గయ్యపేట వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభానుపై జగ్గయ్యపేట, వత్సవాయి, నందిగామ, చిల్లకల్లు తదితర పోలీసు స్టేషన్‌లలో 10 కేసులు వున్నాయి. వివిధ దశల్లో విచారణలో ఉన్న ఈ కేసులను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేస్తూ గతేడాది మే నెలలో ఆదేశాలు జారీ చేసింది. ప్రజాప్రతినిధులపై కేసులను విచారించడానికి ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి ప్రత్యేక కోర్టులో ఉదయభానుపై కేసులు విచారణలో ఉన్నాయి. కేసుల ఎత్తివేత కోసం ఆయా కోర్టుల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో పిటిషన్లు దాఖలు చేయించాలని ప్రభుత్వం డీజీపీని ఆదేశించింది.  

ఒక్క జీవోతో పది కేసులను ఎలా ఉపసంహరించుకుంటారని ఉన్నత న్యాయస్థానం గతంలోనే పోలీస్ ఉన్నతాధికారులను ప్రశ్నించింది. వివరణ ఇవ్వాల్సిందిగా డిజీపీ, హోం శాఖ ముఖ్యకార్యదర్శి నోటీసులు కూడా జారీచేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ క్రమంలోనే ఇవాళ మరోసారి  విచారణ జరిపిన న్యాయస్థానం కేసుల ఉపసంహరణపై మరిన్ని అనుమానాలు వ్యక్తం చేసింది. 

click me!