
YSRCP supports NDA's presidential candidate: రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన నేత ద్రౌపది ముర్ము పేరును బీజేపీ ప్రకటించింది. ఈ ప్రకటన తర్వాత ఆమెకు భద్రతను పెంచారు. ఇక నుంచి ఆమెకు Z+ కేటగిరీ భద్రత లభించనుంది. అలాగే, ప్రతిపక్ష పార్టీలు సైతం రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పేరును ప్రకటించాయి. అయితే, అధికారపక్షం అభ్యర్థి విజయం సాధించడానికి వైకాపా మద్దతు కీలకం కానుంది. ఎందుకంటే ప్రస్తుతం అధికార, ప్రతిపక్ష పార్టీల ఓటింగ్ పాయింట్లను గమనిస్తే.. రాష్ట్ర అభ్యర్థిత్వానికి కావాల్సిన ఓటింగ్ పాయింట్ లో బీజేపీ కాస్త వెనుకబడి ఉంది. రాష్ట్రపతి పీఠంపై తమ అభ్యర్థిని నిలబెట్టాలని విపక్షాలు సైతం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఇలాంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైకాపా.. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ప్రకటించినట్టు స్పష్టమైన సంకేతాలు పంపినట్టు తెలుస్తోంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కూటమి (ఎన్డీఏ) తమ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పేరును ప్రకటించిన తర్వాత వైకాపా నేత, పార్లమెంట్ సభ్యులు విజయ్‌సాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు అభినందనలు తెలిపారు. ప్రధాని మోడీ మీరు మన దేశానికి గొప్ప రాష్ట్రపతి అవుతారని ముందుగానే చెప్పారంటూ కామెంట్ చేయడంతో పాటు ముర్ముకు శుభాకాంక్షలు సైతం తెలిపారు. దీంతో ఎన్డీఏ ప్రకటించిన రాష్ట్రపతి అభ్యర్థికి తమ మద్దతు ఉందని వైకాపా స్పష్టం చేసినట్టైంది.
విజయ్ సాయి రెడ్డి ట్విట్టర్ లో స్పందిస్తూ.. "NDA ద్వారా రాష్ట్రపతి ఎన్నికలకు అభ్యర్థిగా నామినేట్ అయినందుకు శ్రీమతి ద్రౌపది ముర్ము జీకి హృదయపూర్వక అభినందనలు. గౌరవనీయులైన PM@నరేంద్ర మోడీజీ.. మీరు మన దేశానికి గొప్ప రాష్ట్రపతి అవుతారని సరిగ్గానే చెప్పారు. మేడమ్ మీకు మా శుభాకాంక్షలు" అని పేర్కొన్నారు.
విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ గమనిస్తే.. కేంద్రంలోని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంతో తన బంధాన్ని పదిలపరుచుకోవడానికి వైకాపా ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కారు 15వ రాష్ట్రపతికి జరగబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థికి మద్దతు తెలుపుతుందని స్పష్టంగా సూచనలు పంపింది. మ్యాజిక్ ఫిగర్‌లో ఎన్డీఏ కేవలం 1.2 శాతానికి తగ్గినప్పుడు, ఎలక్టోరల్ కాలేజీలో నాలుగు శాతం ఓట్లతో జగన్ మోహన్ రెడ్డి సర్కారు సాయం చేయడానికి సిద్దంగా ఉందని స్పష్టమైంది. 175 మంది సభ్యులున్నఏపీ రాష్ట్ర అసెంబ్లీలో 151 మందితో పాటు లోక్‌సభలో జగన్ పార్టీకి 22 మంది, రాజ్యసభలో తొమ్మిది మంది సభ్యులున్నారు.