యర్రగొండపాలెం ఘటనలో కీలక పరిణామం .. చంద్రబాబు రోడ్‌షోపై కేసు నమోదు

By Siva KodatiFirst Published Apr 22, 2023, 9:01 PM IST
Highlights

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించిన రోడ్ షోపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అనుమతి లేని చోటు సభ ఏర్పాటు చేయడంపై ఈ కేసులు నమోదు చేసినట్లుగా అధికారులు తెలిపారు.
 

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌పై దాడి ఘటన నేపథ్యంలో ఏపీలో అధికార , ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. చంద్రబాబు రోడ్ షోకు సంబంధించి మూడు కేసులు నమోదయ్యాయి. అనుమతి లేని చోటు సభ ఏర్పాటు చేయడంపై ఈ కేసులు నమోదు చేసినట్లుగా అధికారులు తెలిపారు. ఈ మేరకు డీఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి ఆదిమూలపు సురేష్ క్యాంప్ కార్యాలయంపై దాడి చేసిన టీడీపీ కార్యకర్తలను సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించినట్లు తెలిపారు. వీరిపై కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. యర్రగొండపాలెం ఘటనలో పోలీసుల వైఫ్యలం లేదని డీఎస్పీ స్పష్టం చేశారు. 

ఇదిలావుండగా నిన్న యర్రగొండపాలెంలో చంద్రబాబు నాయుడి వాహనంపైరాళ్ల దాడి జరిగింది. దీంతో భద్రతా సిబ్బంది వెంటనే అలెర్ట్ అయ్యారు. ఆయనకు దెబ్బలు తగలకుండా తమ వద్ద ఉన్న బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను అడ్డుపెట్టారు. రాళ్ల దాడి నుంచి రక్షణ కల్పించారు. చంద్రబాబు నాయుడు రాష్ట్రవ్యాప్త పర్యటనలో భాగంగా ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం మార్కాపురంలో పర్యటన ముగించుకున్నారు. సాయంత్రం యర్రగొండపాలెంకు బయలుదేరారు. 

Also Read: చంద్రబాబు నాయుడి వాహనంపై రాళ్ల దాడి.. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు అడ్డుపెట్టి రక్షణ కల్పించిన భద్రతా సిబ్బంది

అయితే చంద్రబాబు నాయుడి పర్యటన యర్రగొండపాలేనికి చేరుకోగానే 200 మంది రోడ్డు పై నిలబడి బాబు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. నల్ల జెండాలు, బెలూన్లు ప్రదర్శించారు. ఈ సమయంలో ఒక్క సారిగా ఆయన వాహనంపై రాళ్ల దాడి జరిగింది. దీంతో ఎన్ఎస్ జీ కమాండెంట్ సంతోష్ కుమార్ తలకు గాయాలు అయ్యాయి. చంద్రబాబు నాయుడికి గాయాలు కాకుండా భద్రతా సిబ్బంది బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను అడ్డుపెట్టారు.

ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన చంద్రబాబు నాయుడు మంత్రి ఆదిమూలపు సురేష్ ఆఫీసు ఎదుట తన వాహనాన్ని నిలిపారు. తన జోలికొస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. ఈ సమయంలో అక్కడి పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సమయంలో మళ్లీ వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమయంలో కొందరు టీడీపీ కార్యకర్తలు జెండాలను మంత్రి ఆఫీసుపైకి వేశారు. ఇదే సమయంలో మంత్రిని పోలీసులు ఆఫీసులోకి తీసుకెళ్లారు.

click me!