
అత్త మీద కోపం దుత్తమీద చూపినట్లుంది పోలీసుల వ్యవహారం. ప్రతిపక్ష వైసీపీని ఏం చేయలేక సోషల్ మీడియాపై పడుతోంది ప్రభుత్వం. మొన్న రవికిరణ్ న్ను అరెస్టు చేసిన పోలీసులు ఈరోజు వైసీపీ ఐటి విభాగం హెడ్ మధుసూధన్ రెడ్డిని విచారిస్తున్నారు. ఎంతసేపు రవికిరణ్ కు వైసీపీకి ఏదో ఒక లింక్ కలుపుదామన్న ఉద్దేశ్యంతోనే పోలీసులు ఆలోచిస్తున్నట్లు కనబడుతోంది.
ఎందుకంటే, మధుని విచారణకు పిలిపించిన పోలీసులు తన గురించి ప్రశ్నించాలి. లేదా వైసీపీ గురించి అడగాలి. కానీ రవికిరణ్ తో ఉన్న సంబంధాల గురించే అడుగుతున్నారు. అందులోనే తెలిసిపోతోంది పోలీసుల టార్గెట్.
ప్రభుత్వం ఏం ఆశించి ఇదంతా చేస్తోందో అర్ధం కావటం లేదు. సోషల్ మీడియాలో చంద్రబాబునాయుడు, లోకేష్ పై వ్యంగ్యంగా, వ్యతిరేకంగా పోస్టులు వస్తున్నాయన్నకారణంగా సోషల్ మీడియాపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించుకున్నది. నిజానికి సాధ్యం కాకపోయినా ప్రయత్నం అయితే మొదలుపెట్టింది. అందులో భాగంగానే ఫెస్ బుక్ లో పవర్ పంచ్ గ్రూపు అడ్మిన్ రవికిరణ్ న్ను అరెస్టు చేసింది.
అయితే అరెస్టు చేసిన తర్వాత ఏం కేసు పెట్టాలో పోలీసులకు తోచలేదు. దానికి తోడు రవికిరణ్ అరెస్టుపై ఒక్కసారిగా వ్యతిరేకత మొదలైంది. దాంతో ఉలిక్కిపడిన ప్రభుత్వం వెంటనే రవికిరణ్ న్ను వదిలేసింది. అదే రోజు వైసీపీ ఎంపి విజయసాయిరె డ్డి మాట్లాడుతూ, తాను కూడా చంద్రబాబు, లోకేష్ లకు వ్యతిరేకంగా పోస్టులు పెడతానని చెప్పారు. తనపై కేసులు పెట్టి అరెస్టు చేసుకోవచ్చని సవాలు విసిరారు.
అదే విధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైసీపీ అభిమానులు చంద్రబాబు ప్రభుత్వపై వ్యతిరేక పోస్టులు పెట్టాలంటూ జగన్మోహన్ రెడ్డే స్వయంగా పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి గనుక ధైర్యముంటే జగన్, విజయసాయి రెడ్డిపై కేసులు పెట్టి అరెస్టు చేయాలి. అలాకాకుండా పవర్ పంచ్ గ్రూపుకు జగన్ కు లింక్ కోసం వెతకటం ఎందుకు?
ఒకవేళ నిజంగానే రవికిరణ్ ద్వారా జగనే పోస్టులు పెట్టిస్తున్నాడనుకుందాం. ఏం చేస్తారు జగన్ను? జగన్, షర్మిల, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ పైన ఇప్పటికీ టిడిపి అధికారిక వెబ్ సైట్లో వ్యంగ్యంగా, అభ్యంతరకరంగా పోస్టులు పెట్టటం లేదా? సోషల్ నెట్ వర్క్ లోని టిడిపి గ్రూపుల్లో జగన్నుకించపరుస్తూ పోస్టులు కనబడటం లేదా? టిడిపి వెబ్ సైట్ లో వచ్చిన పోస్టులకు చంద్రబాబు, లోకేష్ బాధ్యత వహిస్తారా?
కాబట్టి ఎవరు ఎవరిపై పోస్టులు పెట్టినా ఎవరికీ ఏమీ కాదు. సోషల్ మీడియాను నియంత్రించాలన్న ఏకైక లక్ష్యంతో అనవసరంగా ప్రభుత్వం ఆయాసపడటం తప్ప ఇంకేమీ ఉపయోగం లేదు.