కాకినాడలో టిడిపికి ‘కాపు’ గండం

First Published Aug 22, 2017, 5:02 PM IST
Highlights
  • కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలో తెలుగుదేశంపార్టీకి కాపు సామాజిక వర్గం నుండి గండం పొంచివుంది.
  • గడచిన ఏడాదిన్నరగా కాపు సామాజికవర్గంలోని పలువురు నేతలకు, ప్రభుత్వానికి మధ్య ఒక విధంగా యుద్ద వాతావరణమే నెలకొంది.
  • కాపు రిజర్వేషన్ కోసం ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఆందోళనలను ప్రభుత్వం అణగదొక్కేస్తుండటమే కారణం.
  • కాపులను బిసిల్లోకి చేర్చటమనే హామీని చంద్రబాబు నెరవేర్చకపోవటమే పెద్ద సమస్యగా మారింది.

కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలో తెలుగుదేశంపార్టీకి కాపు సామాజిక వర్గం నుండి గండం పొంచివుంది. గడచిన ఏడాదిన్నరగా కాపు సామాజికవర్గంలోని పలువురు నేతలకు, ప్రభుత్వానికి మధ్య ఒక విధంగా యుద్ద వాతావరణమే నెలకొంది. కాపు రిజర్వేషన్ కోసం ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఆందోళనలను ప్రభుత్వం అణగదొక్కేస్తుండటమే కారణం. ముద్రగడ కాపు ఉద్యమం వల్లే ప్రభుత్వం ముంజూనాధ కమీషన్ వేసిందన్నది వాస్తవం. అదే విధంగా కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసినా ముద్రగడ ఒత్తిడి వల్లే.

అయినా కాపులను బిసిల్లోకి చేర్చటమనే హామీని చంద్రబాబు నెరవేర్చకపోవటమే పెద్ద సమస్యగా మారింది. అదికూడా పోయిన ఎన్నికల్లో తనంతట తానుగా చంద్రబాబు హామీనిచ్చి మాటతప్పారు. దాంతో ముద్రగడ ముఖ్యమంత్రిని బాగానే ఇరికిచ్చికున్నారు. అప్పటి నుండి ముద్రగడ ఏదో ఒక ఆందోళన పేరుతో కాపు ఉద్యమాన్ని సజీవంగా ఉంచుతున్నారు.

ఇటువంటి నేపధ్యంలోనే ప్రభుత్వ ప్రమేయం లేకుండానే కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక నిర్వహించాల్సి వచ్చింది. దాంతో చంద్రబాబుకు బాగా ఇబ్బంది మొదలైంది. పైకి చూడటానికి టిడిపికి అంతా బాగానే ఉన్నట్లు అనిపిస్తున్నా లోలోపల మాత్రం నేతల్లో తీవ్ర ఆందోళన కనిపిస్తోంది. కాపు సామాజికవర్గంలో ముద్రగడకు మంచి పేరే ఉంది. అటువంటిది ముద్రగడ పై చంద్రబాబు కక్షగట్టినట్లు వ్యవహరిస్తుండటం సామాజికవర్గం మండిపోతోంది.

సరిగ్గా అదే సమయంలో కాకినాడ ఎన్నిక వచ్చింది. దాంతో చంద్రబాబు, మంత్రులకు కాపులను ఎలా ప్రసన్నం చేసుకోవాలో అర్ధం కావటం లేదు. ఎందుకంటే, కార్పొరేషన్ పరిధిలోని సుమారు 2 లక్షల ఓట్లలో కాపుల ఓట్లే సుమారు 55 వేలున్నాయి. అంటే ఓ పార్టీ గెలుపోటముల్లో కాపులు ఎంత కీలకమో అర్దమవుతోంది. అందుకే టిడిపిలో ఆందోళన మొదలైంది. దానికితోడు ముద్రగడ కూడా టిడిపికి వ్యతిరేకంగా కాపులందరూ ఓట్లేయాలని పిలుపివ్వటం చంద్రబాబుకు మింగుడుపడటం లేదు. కాపు గండం నుండి చంద్రబాబు ఎలా గట్టెక్కుతారో చూడాలి.

click me!