
రాజకీయాలు ఎంత జుగుప్సాకరంగా తయారయ్యాయో నంద్యాల ఉపఎన్నికలో జరిగిన ఓ ప్రచారమే ఉదాహరణ. బ్రతికున్న మహిళను టిడిపి చంపేసింది. ఇపుడా మహిళ తాను బ్రతికేఉన్నాను మొర్రో అని మొత్తుకుంటోంది. ఇంతకీ జరిగిందేంటంటే, హోరా హోరీగా జరిగిన ప్రచారంలో భాగంగా చంద్రబాబునాయుడు నంద్యాలలో ప్రచారం చేసారు. ఆ సందర్భంగా ఒకచోట మాట్లాడుతూ, వైసీపీ అభ్యర్ధి శిల్పా మోహన్ రెడ్డి బంధువులు ఓ ముస్లిం మహిళను రేప్ చేసి చంపేసారంటూ తీవ్రమైన ఆరోపణలు చేసారు.
వ్యాన్లో చంద్రబాబు పక్కనే ఉన్న నేతలు సదరు మహిళ ఫొటోను కూడా చూపించారు. సరే, ఆ ప్రచారాన్ని ఎంతమంది నమ్మారన్న విషయం వేరే సంగతి. సీన్ కట్ చేస్తే, రెండు రోజుల తర్వాత ఓ మహిళ నంద్యాలలోని మీడియా ముందుకొచ్చింది. బ్రతికుండగానే ప్రచారం కోసం చంద్రబాబు తనను చంపేసారంటూ మండిపడుతోంది, భోరుమంటోంది. దాంతో టిడిపి నేతలకు ఏం సమాధానం చెప్పాలో అర్ధం కావటం లేదు.
టిడిపి నేతలు చూపించిన ఫొటోలో మరో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. ఆ ఇద్దరిలోని ఓ మహిళ చనిపోయింది వాస్తవం. కానీ ఆ ఇద్దరి మహిళల మొహాలు ఫొటోల్లో సరిగా కనబడటం లేదు. కేవలం షమీమ్ మొహం మాత్రమే కనబడుతోంది. కాబట్టి చనిపోయింది షమీమే అంటూ ప్రచారం జరిగింది. సదరు ప్రచారాన్ని స్ధానిక కేబుల్ టివిలో చూసిన ఆమె భర్త ఇపుడు ఇంట్లో పెద్ద గొడవ చేస్తున్నాడట.
దాంతో బ్రతికుండగానే చనిపోయినట్లు తనను ఎలా చూపుతారంటూ షమీమ్ టిడిపి నేతలను నిలదీస్తోంది. శిల్పా మోహన రెడ్డిపై ఉన్న అక్కసంతా చంద్రబాబు తీర్చేసుకున్నారు షమీమ్ ఫోటో చూపించి. ఇపుడు ఆమె ప్రశ్నలకు సమాధానం ఎవరు చెబుతారు? రాజకీయాల్లో ఎదుటి వారిపై బురద చల్లే కార్యక్రమం నంద్యాలలో చంద్రబాబు ఆధ్వర్యంలోనే ఎంత ఘనంగా జరిగిందో.